తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? అన్న సందేహం లాంటిదే ఇది. బన్నీతో దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా చేయడం లేదు. అది క్లియర్ అయిపోయింది. కానీ వై..? అన్నదే తెలియాల్సి వుంది. వాస్తవానికి అఖిల్ తో హలో సినిమాకు ముందే బన్నీతో డిస్కషన్లు జరిగాయి. అయితే బన్నీ ఓ సినిమా తరువాత చేద్దాం అనుకున్నాడు. విక్రమ్ కుమార్ ఈ గ్యాప్ లో అఖిల్ తో సినిమా మీదకు వెళ్లాడు.
ఇప్పుడు బన్నీ ఫ్రీ. డైరక్టర్, సినిమా ఏదీ ఇంకా పక్కా కాలేదు. మరి హలో తరువాత విక్రమ్ కుమార్ కూడా రెడీ. అలాంటపుడు కూడా ఈ కాంబినేషన్ ఎందుకు సెట్ కాలేదు? బన్నీ డేట్లు ఇస్తానంటే, నాని వైపు వెళ్లడు కదా? విక్రమ్ కుమార్? మరి ఎందుకు వెళ్లినట్లు? మహేష్ సిస్టర్ మంజుల దగ్గర డేట్లు వున్న మాట వాస్తవమే. అవి చాలా కాలంగా వున్నాయి. మరి కొంతకాలం వుండమన్నా వుంటాయి.
దీని వెనుక నిజమో కాదో కానీ, ఆసక్తి కరమైన సంగతి వినిపిస్తోంది. తాను చెప్పిన లైన్లు ఏవీ బన్నీకి అంతగా నచ్చకపోవడం వల్లనే విక్రమ్ కుమార్ అటు వెళ్లాడని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ తన దగ్గర వున్న లైన్లతో బన్నీని మెప్పించలేకపోయాడా? అనుమానమే. ఎందుకంటే విక్రమ్ కుమార్ స్టామినా ఏమిటో జనాలకు తెలుసు. లేదా బన్నీ క్యాంప్ వర్కింగ్ స్టయిల్ విక్రమ్ కుమార్ కు సరిపోకపోయివుండాలి. ఎందుకంటే అక్కడ ప్రాజెక్టు ఓకె చేయించుకోవడం, పట్టాలు ఎక్కించడం, ఇండిపెండెంట్ గా సినిమా తీయడం అంత వీజీ కాదు. బహుశా ఇవన్నీ కలిసి, విక్రమ్ కుమార్ ను నాని వైపు నడిపించాయేమో?