ఇలా మనసులో అనుకుంటే, మరొకళ్లు అలా రుమాళ్లు వేసేస్తున్నారు. టాలీవుడ్ లో విడుదల తేదీలకు భలే గిరాకీ వచ్చి పడింది. ఇటు అటు ఒక సెలవు కలిసి వచ్చేలాగో? పండుగ తోడయ్యేలాగో చూసుకుని, ఆ డేట్ కు వద్దాం అనుకంటే, టక్కున మరొకళ్లు ప్రకటించేస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే మూడు నాలుగు నెలలు ముందే డేట్ చెప్పేసేంతగా.
మెగా హీరోలు ఇద్దరి మధ్య ఇలాంటిదే జరిగింది. వినాయక్ డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ సినిమా చేస్తునాడు. ఇంటిలిజెంట్ అన్నది టైటిల్. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామనుకున్నాడు. యూనిట్ లో అనుకున్నారు. ఆ విధంగా రెడీ అవుతున్నారు. కానీ రుమాలు వేయడం మరిచారు. నిన్నటికి నిన్న మరో మెగా హీరో వరుణ్ తేజ రుమాలేసేసాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ సినిమా డేట్ హుష్ కాకి అయిపోయింది.
అలా అని డేట్ చెప్పేసినంత మాత్రాన అయిపోవడం లేదు కూడా. రామ్ చరణ్ రంగస్థలం యూనిట్ ముందే సంక్రాంతికి ఇలాగే డేట్ అయిదు నెలల ముందు ప్రకటించింది. మీతో నాకేంటీ అన్నట్లుగా డైరక్టర్ త్రివిక్రమ్-పవన్ కలిసి ఆ డేట్ కు వారం రోజులు ముందుగా తమ సినిమా డేట్ ను ప్రకటించారు.
బన్నీ సినిమా నా పేరు సూర్య విషయంలోనూ అలాగే జరిగింది. బన్నీ అనుకున్న డేట్ కు మహేష్ తన సినిమాను ప్రకటించాడు. అంటే డేట్ లు ప్రకటించినా సమస్యే.. ప్రకటించకున్నా సమస్యే. హీరోలు భారీ రెమ్యూనిరేషన్లు తీసుకుంటూ, భారీగా ఖర్చు చేయిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఆ పెట్టుబడి రాబట్టుకోవడం కోసం ఇలా డేట్ ల కోసం పోటా పోటీ పడుతున్నారు.