బోయపాటి 110 కోట్లు ఖర్చు చేయిస్తూ చెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాకు మరో సెట్ బ్యాక్ వచ్చినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న దానికన్నా వర్కింగ్ డేస్ భయంకరంగా పెరిగిపోయాయి. ఇప్పటికి వందకు పైగా వర్కింగ్ డేస్ అయ్యాయి. ఇంకా మరో ముఫై నుంచి ముఫై అయిదు రోజులు షూట్ వుంది. మరి ఈ కారణంగా ఇచ్చిన డేట్స్ అయిపోయాయో? మరేదైనా తేడా వచ్చిందో? తెలియదు కానీ, సినిమాటోగ్రాఫర్ రుషి పంజాబీ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం వల్ల అసలే ఖర్చు, బడ్జెట్ భయంకరంగా పెరిగిపోయింది అనుకుంటే మరింత భారం పడినట్లు తెలుస్తోంది. కొత్తగా మళ్లీ ఆర్ధర్ విల్సన్ ను తీసుకుని, అతనికి మళ్లీ రెమ్యూనిరేషన్ సెట్ చేసినట్లు వినికిడి. మొత్తంమీద చూసుకుంటే ఈ సినిమాకు నిర్మాత దానయ్యకు ఓవర్ బడ్జెట్ పుణ్యమా అని కాస్త ఇబ్బంది తప్పేటట్లు లేదు.
ఇదిలా వుంటే అసలు ఓవర్ బడ్జెట్ లేదని, అనుకున్న బడ్జెట్ లోనే సినిమా చేస్తున్నామని నమ్మించడానికి దర్శకుడు బోయపాటి టీమ్ కిందామీదా అవుతోంది. అదే సమయంలో అసలు ఈ ఓవర్ బడ్జెట్ వ్యవహారాలు అన్నీ ఎలా లీక్ అవుతున్నాయా? అన్న విషయమై బోయపాటి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.