వైఎస్ జగన్ మీద హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయాలనే ప్రయత్నం మొదటి నుంచీ వుంది. కానీ హిందూ ఆలయాలు కానీ, వాటికి సంబంధించిన నిర్ణయాల విషయంలో ఆయన బయట ప్రచారం ఎలా వున్నా కూడా సరైన, సానుకూల నిర్ణయాలే తీసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కామన్ మాన్ కు కీలకమైన వినాయకచవితి విషయంలో తీసుకున్న నిర్ణయం మాత్రం కాస్త గట్టిగా ఝలక్ ఇచ్చేలా కనిపిస్తోంది.
వినాయక చవితి అన్నది విపరీతంగా జరిపే పండగ. ప్రతి అపార్ట్ మెంట్ కాంప్లెక్స్, ప్రతి కాలనీ, ప్రతి వీధిలో పూజలు జరుపుకోవడం అన్నది సర్వ సామాన్యం. ఇంత పెద్ద ఎత్తున జరిగే పండగ మరోటి లేదు. దసరా అయినా కూడా ఇన్ని విగ్రహాలు వుండవు. అలాంటి పండగ సామూహికంగా జరపడానికి వీలు లేదు అని ఆదేశాలు జారీ చేయడం ప్రజల్లో గట్టిగా అసంతృప్తికి దారితీస్తోంది.
సోషల్ మీడియాలో చలామణీ అవుతున్న విడియోలు మామూలుగా లేవు. మున్సిపాల్టీ చెత్త ట్రాక్టర్ లోకి వినాయక విగ్రహాలు డంప్ చేస్తున్న విడియో అలాంటి వాటిల్లో ఒకటి. ఇలాంటివి హిందువుల మనో భావాలను మామూలుగా దెబ్బతీయవు. పైగా కరోనా అనే సాకు ఇక్కడ డిఫెండ్ చేయడం లేదు. రోజుకు మూడు షో లకు థియేటర్లకు జనం వచ్చి వెళ్తున్నారు. బార్ లకు వచ్చి వెళ్తున్నారు. బజార్లు, షాపింగ్ మామూలే. కేవలం అర్థరాత్రి నుంచే కర్ఫ్యూ వుంది తప్ప పగలు లేదు.
పుట్టిన రోజులు, పెళ్లిళ్లు భయంకరంగా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆధేశాలను చూస్తున్నారు జనం. వేలాది మంది పేద కార్మికులు, దుకాణ దారులు వినాయకచవితి మీద ఆధారపడి వున్నారు. వారంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయినట్లే.పైగా పక్కన తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. వేరే రాష్త్రాల్లో వుంటే వుండొచ్చు. కానీ జనం చూసేది జగన్ ను, ఆంధ్రను మాత్రమే.
ఏమైనా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ వర్గంలో కాస్త అసంతృప్తికి దారితీస్తోంది. ఒక చినుకు ఏమీ ప్రమాదం కాకపోవచ్చు. చినుకు..చినుకు కలిస్తే ప్రవాహమే అవుతుంది. జగన్ ప్రభుత్వం అది గమనించుకోవాలి. ఇప్పటికే రోడ్ల పరిస్థితి మామూలుగా నెగిటివ్ కావడం లేదు.
స్టీల్ ప్లాంట్, గంగవరం లాంటివి విశాఖలో, అమరావతి దక్షిణ కోస్తాలో ఎఫెక్ట్ చూపిస్తే, వినాయక చవితి మాత్రం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందన్న సంగతి గమనించుకోవాలి.