మరో వివాదానికి రెడీ అవుతున్న బండ్ల గణేశ్!

జీవిత రాజశేఖర్ కు వ్యతిరేకంగా గళమెత్తి మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకున్నాడు బండ్ల గణేశ్. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా జీవిత-రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని, అలాంటి వాళ్లతో కలిసి ఒకే ప్యానెల్…

జీవిత రాజశేఖర్ కు వ్యతిరేకంగా గళమెత్తి మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకున్నాడు బండ్ల గణేశ్. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా జీవిత-రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని, అలాంటి వాళ్లతో కలిసి ఒకే ప్యానెల్ లో కలిసి పనిచేయడం ఇష్టంలేదని తేగేసి చెప్పేశారు. ఈ మేరకు ఆయన గతంలో రాజశేఖర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల్ని కూడా పోస్ట్ చేశారు.

ఇలా చిరు, పవన్ అభిమానులతో జేజేలు అందుకుంటున్న బండ్ల గణేశ్.. అంతలోనే వాళ్లకు కోపం తెప్పించే పని చేయబోతున్నట్టు తెలుస్తోంది. అవును.. ప్రకాష్ రాజ్ గ్రూప్ ను వీడిన బండ్ల గణేశ్ నేరుగా వెళ్లి మంచు విష్ణు/నరేష్ గ్రూపులో చేరబోతున్నారట. ఇదే కనుక జరిగితే ఇన్నాళ్లూ బండ్లను పొగిడిన నోళ్లే, ఇప్పుడు ఆయన్ను తిట్టడం ఖాయం.

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు తో పాటు టోటల్ మెగా కాంపౌండ్ అంతా ప్రకాష్ రాజ్ వర్గానికి మద్దతిస్తోంది. ఇది బహిరంగ రహస్యం. నాగబాబు స్వయంగా వచ్చి తన మద్దతు తెలిపారు. అదే టైమ్ లో నరేష్ గ్రూప్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. 2 నెలల కిందట నరేష్ ప్యానెల్ పై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

కట్ చేస్తే, నరేష్ వర్గం, మంచు విష్ణు వర్గం కలిసి ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రకాష్ రాజ్ వర్గంతో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాయి. జీవిత రాజశేఖర్ పై కోపంతో బండ్ల గణేశ్ వెళ్లి నరేష్-మంచు విష్ణు వర్గంలో చేరితో అది మొత్తంగా మెగా కాంపౌండ్ కు ఆగ్రహం తెప్పించే విషయం అవుతుంది.

ప్రస్తుతానికైతే బండ్ల గణేష్.. తను స్వతంత్రంగానే పోటీచేస్తాననే మాట మీద నిలబడి ఉన్నారు. నరేష్ వర్గం మాత్రం బండ్లతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది. తమ గ్రూప్ లోకి వస్తే, నచ్చిన పోస్టుకు ఆభ్యర్థిగా నిలబడే ఛాన్స్ ఇస్తామని ఊరిస్తోంది.

బండ్ల గణేశ్ కనుక నేరుగా వెళ్లి నరేష్ తో చేతులుకలిపితే మా అసోసియేషన్ ఎన్నికల్లో మరో వివాదం రాజుకున్నట్టే. అయితే బండ్ల అంత సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే, ఆయన పవన్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయనకు కోపం తెప్పించే పని చేయకపోవచ్చు.