చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ సినిమాకి దర్శకత్వం వహించిన వినాయక్, ఆ సినిమాతో బంపర్ హిట్టే కొట్టాడు. చిరంజీవికి వీరాభిమాని వినాయక్. అయితే అందరు హీరోలతోనూ సఖ్యతగా వుండడం వినాయక్ స్పెషాలిటీ. మిగతా హీరోలతో సఖ్యత సంగతి అలా వుంచితే, చిరంజీవి అంటే వినాయక్‌కి ప్రత్యేకమైన అభిమానం. మాస్ సినిమాల్ని బాగా డీల్ చేయగల వినాయక్ అంటే చిరంజీవికీ ప్రత్యేకమైన గౌరవమే. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఠాగూర్’ సినిమా తర్వాత ఇంకోటి రావాల్సి వుంది. అయినా అదింకా సెట్స్‌పైకి రాలేదు.
రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి సినిమాల్ని పక్కన పెట్టడంతో చిరంజీవి ` వినాయక్ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. లేకపోతే ఎప్పుడో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి వుండేదే. తన 150వ సినిమాకి వినాయక్ దర్శకుడని చిరంజీవి ప్రకటించి ఏళ్ళు గడిచిపోతున్నాయి. అయినా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలేదు. ‘నాన్న సినిమాకి నేనే నిర్మాతని..’ అని చరణ్ కూడా ప్రకటించి ఏళ్ళు గడిచిపోయాయి.
ఎప్పుడు వినాయక్ మీడియా ముందుకొచ్చినా, ‘అన్నయ్యతో సినిమా చేస్తా.. అన్నయ్య నటించే 150వ సినిమా నాదే.. కథా చర్చలు జరుగుతున్నాయి.. అన్నయ్య ఎప్పుడు ఓకే అంటే అప్పుడే అది సెట్స్‌పైకి వస్తుంది..’ అని చెబుతున్నాడు. మీడియా ప్రశ్నలకు వినాయక్ రొటీన్ సమాధానమే చెప్పాల్సి వస్తోంది. ఇంకా ఎన్నాళ్ళు వినాయక్ ఇదే సమాధానం చెప్తాడోగానీ, రానురాను చిరంజీవి నటించబోయే 150వ సినిమాపై ఆసక్తి తగ్గిపోతోంది జనానికి.