తమిళ హీరోల తెలుగు మార్కెట్ నానాటికీ కిందకు జారుతోంది. ఇలాంటి టైమ్ లో మన మార్కెట్ లో కూడా సరైన సినిమాలు లేకపోవడంతో కాస్త మంచి రేట్లు పలుకుతున్నాయి. విజయ్ విజిల్, కార్తీ ఖైదీ సినిమాలు బాగానే ఆడాయి. దాంతో మళ్లీ కాస్త మార్కెట్ పుంజుకుంటోంది.
విశాల్ లేటెస్ట్ సినిమా యాక్షన్ ను తెలుగు థియేటర్ హక్కులను అయిదు కోట్ల మేరకు కొన్నారు. విశాల్ సినిమాలు అభిమన్యుడు, డిటెక్టివ్ బాగా ఆడాయి. కానీ పందెంకోడి 2 కోంచెం నిరాశ పరిచింది. యాక్షన్ సినిమా ట్రయిలర్ ఫుల్ పవర్ ప్యాక్డ్ గా వుండడంతో, తెలుగు థియేటర్ కు మంచి రేటు పలికింది.
విశాల్ యాక్షన్ సినిమాకు సుందర్ సి దర్శకుడు. సుందర్ కు మాస్ పల్స్ బాగా తెలుసు. ఎక్కడ తూకం రాళ్లు అక్కడ వేసినట్లు నడుపుతాడు సినిమాను. బి,సిలను టార్గెట్ చేసే డైరక్టర్. అయితే ఈసారి మాత్రం స్టయిలిష్ బాండ్ సినిమాలా తీసినట్లు కనిపిస్తోంది. ఖర్చు కూడా కాస్త ఎక్కువే పెట్టినట్లుంది. విజిల్ తరువాత తెలుగులోకి కాస్త గట్టిగా విడుదల చేసే భారీ డబ్బింగ్ సినిమా ఇదే అనుకోవాలి.