రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. ఏ నాయకుడు ఏం చేస్తాడో చెప్పలేం. రాజకీయ నాయకులు ఎవరినైనా పొగిడినా, విమర్శంచినా మీడియాలో పెద్ద చర్చగా మారుతుంది. విమర్శలు చేయడం లేదా ప్రశంసించడం వెనక ఉన్న వ్యూహమేంటి? అనే డిస్కషన్స్ జరుగుతాయి. ప్రతిపక్ష నాయకులు అధికారపక్ష నేతలను లేదా మంత్రులను విమర్శిస్తే అది సహజమే కదా అనుకుంటారు.
కాని ప్రతిపక్ష నాయకులు అధికార పక్షాన్ని, మంత్రులను, సీఎంను లేదా పీఎంను ప్రశంసల్లో ముంచెత్తితే అది హాట్ టాపిక్‌గా మారుతుంది. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షాన్ని పొగిడితే అతను 'జంప్ జిలానీ' అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి అనుమానమే తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కలుగుతోంది. ఆయన టీఆర్‌ఎస్‌లోకి పోతాడేమోనని డౌటుగా ఉంది. దీని మీద కాంగ్రెసులో, టీఆర్‌ఎస్‌లో చర్చించుకుంటున్నారట…!
రాజగోపాల్ రెడ్డి మీద డౌటు రావడం అసహజం కాదు. ఆయనకు ఆల్రెడీ డౌటు కలిగించే చరిత్ర ఉంది. గతంలో ఈయన కాంగ్రెసులో యమ టెన్షన్ టెన్షన్ పుట్టించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి టెన్షనే మొదలైంది. మళ్లీ కొత్తగా టెన్షన్ ఎందుకు కలుగుతోంది? అంత పని ఈయనేం చేశాడు? రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న యాదాద్రి భువనగిరి జల్లాలోని దండుమల్కాపూర్ దగ్గర పే…ద్ద ఇండస్ట్రియల్ పార్కుకు ప్రారంభోత్సవం చేశాడు. వేల ఎకరాల్లో ఉన్న ఈ పారిశ్రామిక పార్కులో లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. ఇది అతి పెద్ద ఇండస్ట్రియల్ పార్కు కావడం, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతుండటంతో రాజగోపాల్ రెడ్డి ఖుషీ అయ్యాడు. టీఆర్‌ఎస్ సర్కారు గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ కలిగింది. దీంతో కేటీఆర్ మీద, ప్రభుత్వం మీద ప్రశంసల జల్లులు కురిపించాడు. కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎంతో అనుభవమున్న కేటీఆర్ పరిశ్రమల మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నాడు.
టీఆర్‌ఎస్‌ను ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టే రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పాడు. కేసీఆర్‌కు బద్ధ శత్రువైన కాంగ్రెసు పార్టీలోని కీలక నాయకుడు ఇంతలా ప్రశంసించడంతో ఇదో చర్చనీయాంశమైంది. రాజగోపాల్ రెడ్డి గులాబీ పార్టీలోకి జంప్ చేసేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను, కేటీఆర్‌ను పొగిడినంతమాత్రాన ఆ పార్టీలోకి కచ్చితంగా వెళతాడా? అంటే చెప్పలేం. కాని ఆయన చరిత్ర అనుమానాలకు తావిస్తోంది. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీని, ప్రధాని మోదీని యమ పొగిడాడు. బీజేపీలోకి వెళతానని కూడా స్పష్టంగానే సంకేతాలిచ్చాడు.
ఒకదశలో బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్లే కనిపించింది. బీజేపీ కాకపోతే టీఆర్‌ఎస్‌లోకి పోతాడని అనుకున్నారు. కాని మళ్లీ కాంగ్రెసులోనే కొనసాగుతానని ప్రకటించి అప్పటినుంచి బుద్ధిగానే ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు పురుగు తొలుస్తున్నట్లుగా ఉంది. ఇలా పురుగు తొలవడానికి కారణం హుజూర్‌నగర్ ఉప ఎన్నికని కొందరు నాయకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ పని ఖతమేనని, ఇక ఖేల్ ఖతం… దుకాన్ బంద్ అని కాంగ్రెసు నాయకులు ఎంతగా ప్రచారం చేసినా టీఆర్‌ఎస్ సూపర్ డూపర్ మెజారిటీతో విజయం సాధించింది.
ఆర్‌టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పడుతుందని అనుకుంటే అసలు దాని ఊసేలేకుండా పోయింది. దేశంలో బీజేపీ తగ్గినట్లు కనబడుతోంది. ఈమధ్యనే జరిగిన మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలు కమలం ప్రభ తగ్గినట్లు సంకేతాలిచ్చాయి. దీన్నిబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం వైపు కాకుండా టీఆర్‌ఎస్ వైపే మొగ్గుతుండవచ్చు. ఆయన కాంగ్రెసులోనే ఉంటాడా, జంప్ చేస్తాడా అనేది టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు. ఆ పదవికి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ వెంకటరెడ్డి కూడా పోటీ పడుతున్నాడు.
రాజగోపాలరెడ్డి కాంగ్రెసులో ఉండటమా, బయటకు పోవడమా అనేది సోదరుడు పదవి దక్కించుకోవడంపై ఆధారపడివుంది. వెంకటరెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కాకపోతే రాజగోపాల్ రెడ్డి గులాబీతోట వైపు అడుగులు వేస్తాడేమో..!