విశాల్..తెలుగువాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయినవాడు. ఇప్పుడు అక్కడ అన్ని విధాలుగా దూసుకుపోయే ప్రయత్నాల్లో వున్నాడు. ఈ దూకుడు చూస్తున్నవాళ్లంతా అతగాడు అక్కడ రాజకీయాల్లోకి వెళ్తాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకపక్క తన సినిమాలు తాను చేస్తూనే, మరోపక్క అక్కడి నడిగర్ సంఘం వ్యవహారాల్లో చాలా ఆక్టివ్ గా వుంటున్నాడు. దాదాపు చాలా మందిని ఓ తాటిపైకి తెచ్చి గడచిన రెండేళ్లుగా నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ వ్యవహారాలను ఎదిరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
ఈ బిల్డింగ్ ను 30 ఏళ్ల పాటు సత్యం సినిమాస్ కు లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దీనికి తోడు తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడి ఘోషా ఆసుపత్రిలో ఈ రోజు పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు పంచిపెట్టాడు. గడచిన ఒకటి రెండేళ్లుగా, పాఠశాలల విద్యార్థులకు నోట్స్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తూ వస్తున్నాడు.
ఇదంతా చూసిన వాళ్లు విశాల్ రాజకీయాల్లోకి రావడానికి ఇక ఎంతో సమయం లేదంటున్నారు. కానీ అతగాడు మాత్రం అదేమీ లేదని కొట్టి పారేస్తున్నాడు. చూడాలి మరేం చేస్తాడో?