వివాదాల ‘గబ్బర్‌’

సినీ రంగం ఈ మధ్య వివాదాలతో సావాసం చేయాల్సి వస్తోంది. టైటిల్‌ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ వివాదాలు సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సినిమా ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చుట్టూ వివాదాలు షురూ…

సినీ రంగం ఈ మధ్య వివాదాలతో సావాసం చేయాల్సి వస్తోంది. టైటిల్‌ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ వివాదాలు సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సినిమా ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చుట్టూ వివాదాలు షురూ అవుతున్నాయి. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘ఠాగూర్‌’కి తమిళ మాతృక అయిన ‘రమణ’కి రీమేక్‌. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో హాస్పిటల్‌ సీన్‌ ఒకటుంటుంది. అదే సినిమా వివాదానికి కారణమైంది.

వైద్య వృత్తిని కించపర్చేలా సినిమాలో సన్నివేశాలున్నాయంటూ నటుడు అక్షయ్‌కుమార్‌, దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి లీగల్‌ నోటీసులు పంపాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నిర్ణయించుకుంది. పవిత్రమైన వైద్య వృత్తి పట్ల ప్రజల్లో ఏహ్యభావం పెరిగేలా సినిమాలోని సన్నివేశాలు వున్నాయన్నది ఐఎంఏ ఆరోపణ.

అయితే, సమాజంలోన వివిధ వ్యవస్థల్లో అవినీతి అక్రమాలు పేరుకుపోయాయన్నది కాదనలేని వాస్తవం. వ్యవస్థలోని లోటుపాట్లు సినిమా అయినా మీడియా అయినా ఎత్తి చూపినప్పుడు దాన్ని పట్టుకుని వివాదాలు సృష్టించడంలో అర్థమే లేదు. చాలాకాలం క్రితం తెలుగులో ‘గణేష్‌’ అనే సినిమా ఒకటొచ్చింది. వెంకటేష్‌ హీరోగా నటించిన సినిమా అది. అందులో కూడా అంతే వైద్య రంగంలోని లోటుపాట్లను ఎత్తి చూపారు. అప్పట్లో ఆ సినిమాని బ్యాన్‌ చేయాలంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ, గడచిన కొంతకాలంగా వైద్య వృత్తిలో అక్రమాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారిపోతున్నాయన్న వాస్తవాన్ని విస్మరించలేం.