సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి, తనకు అత్తవారింటినుంచి వేధింపులు వస్తున్నాయనీ, తనకు ప్రాణహాని వుందంటూ హెచ్చార్సీని ఆశ్రయించిన విషయం విదితమే. చక్రి మరణించిన మూడవరోజునే చక్రి భార్య, చక్రి సోదరుడు.. మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. చక్రి భార్య శ్రావణి ఆరోపణలు, వాటిని ఖండిస్తూ చక్రి సోదరుడు మహిత్ నారాయణ మీడియా ముందుకు వచ్చి తమ వాదనలు విన్పించారు.
ఈలోగా కుటుంబ సభ్యులు, కొందరు సినీ పెద్దలు.. వివాదాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగారు. చక్రి మరణం తనను తీవ్రంగా కలచి వేసిందనీ, ఈ సమయంలో తనపై వచ్చిన కొన్ని ఆరోపణలతోనే తాను కలత చెంది, హెచ్చార్సీని ఆశ్రయించానే తప్ప వేరే ఉద్దేశ్యం లేదనీ, చక్రి కుటుంబం తన కుటుంబమేననీ, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై వుందనీ ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిందని స్వయంగా శ్రావణి ప్రకటించారు.
తన సోదరుడు మరణించిన మూడు రోజులకే వివాదం రావడం దురదృష్టకరమన్న మహిత్ నారాయణ్, పదకొండవ రోజు కార్యక్రమం తర్వాత కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కూర్చుని సమస్యకు పరిష్కారం వెతుక్కుంటామని అన్నారు. శ్రావణి, మహిత్ నారాయణ్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి మీడియా ముందుకు రావడంతో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిందనుకోవాలి.