Advertisement


Home > Movies - Movie Gossip
దిలీప్‌ కేసులో ఏం జరుగుతోంది...?

ఒక సూపర్‌ స్టార్‌ను ఉన్నఫలంగా తీసుకెళ్లి జైల్లోకి వేస్తే.. దక్షిణాదిన అంతకు మించిన సంచలనం ఏముంటుంది? అది కూడా రేప్‌ అలిగేషన్స్‌తో.. సదరు హీరో నిజజీవితంలో విలన్‌గా మారాడని, అతడు ఒక హీరోయిన్‌పై.. అత్యాచారం చేయించాడని, అత్యాచారం చేయించడమే గాక.. అత్యాచారం వీడియోలను, ఫొటోలను తీయించి.. వాటిని వెబ్‌లో ఉంచాలనే కుట్రను చేశాడని.. అందుకోసం భారీగా డబ్బును వెచ్చించడానికి కూడా అతడు వెనుకాడలేదని.. వార్తలు వస్తే, పోలీసులు ఈ విషయాలను చెబితే.. ఒకదానికి మించి మరోటి షాక్‌ను కలిగించేలా ఉన్న ఈ వార్తలతో కేరళ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలు, దేశం ఆశ్చర్యపోయింది!

మలయాళ నటిపై లైంగికదాడి, ఆమెను కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారు.. అనే వార్తలు వచ్చినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. భారతదేశంలో సామాన్యమైన అమ్మాయిల మీద అలాంటి దాడులు జరగడం మామూలే కానీ, ఒక హీరోయిన్‌పై ఇలాంటి ఘాతుకం జరిగిందంటే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ప్రత్యూష లాంటి వాళ్లపై దారుణాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి దక్షిణాదిన. అయితే ప్రత్యూషను, ఆమెపై జరిగిన దాడిని శాశ్వతంగా సమాధి చేసేశారు.

చిత్రసీమలో ఉన్న నటీమణుల్లో చాలామంది హీరోయిన్లు లైంగిక దాడుల బాధితులే కావొచ్చు. లైంగిక వేధింపులను ఎదుర్కొని ఉంటూ ఉండవచ్చు. కొంతమంది ఈ విషయంలో ఓపెనప్‌ అవుతున్నారు. మరికొందరు చెప్పుకోలేకపోవచ్చు. అయినా ఏ ఫీల్డ్‌ అయినా ఆడవాళ్లపై ఇలాంటి వేధింపులు మామూలే. స్కూళ్లు కాలేజీల దగ్గర నుంచి ఏదీ ఈ విషయంలో మినహాయింపు కాదు.

ఇలాంటి పరంపరల్లో ఒకటి మలయాళ నటిపై జరిగిన దాడి కేసు. ఈ కేసులో బాధితురాలు సెలబ్రిటీ కావడం. ఆమె తనపై జరిగిన దాడిని దాచేసే అవకాశం ఉన్నా.. భయపడకపోవడం, తనపై దాడి జరిగిందని తెలిస్తే ఎక్కడ తన పరువుపోతుందో అనే భయమేదీ లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం. నటిగా పాపులర్‌ అయిన తను అలాంటి ఫిర్యాదు చేస్తే తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందని ఆమె వెనుకాడకపోవడం అభినందించాల్సిన విషయం.

చాలా లైంగికదాడులు పోలీస్‌ స్టేషన్ల వరకూ వెళ్లవు. వేధింపులను మౌనంగా ఎదుర్కొనడం, అత్యాచారాలకు గురి అయినప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసుల వరకూ వెళ్లకపోవడం భారతీయ సమాజంలో చాలా సహజం. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో అతి తక్కువ మాత్రమే స్టేషన్‌ వరకూ వెళతాయి. పరువుకు భంగకరం అని చాలామంది బాధితులు మౌనంగా ఉంటారు. అయితే దీనికి సదరు మలయాళ నటి మినహాయింపు. అభినందనీయురాలు. ధైర్యవంతురాలు.

ఆమె పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం, ఫిర్యాదు చేయడం ఒక అభినందనీయమైన చర్య అయితే.. ఈ కేసు విషయంలో మొదట్లో గుంభనంగా ఉన్న పోలీసులు ఆ తర్వాత ఏకంగా మలయాళ స్టార్‌ హీరోను ఈ కేసులో అదుపులోకి తీసుకోగలడం మరో అభినందనీయం. దిలీప్‌కు మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది, పెద్దఎత్తున అభిమానగణం ఉంది, అంతేగాక ఆర్థికంగా బలవంతుడు అయ్యాడు.. ఎంతలా అంటే.. మలయాళ చిత్ర పరిశ్రమను చేతిలో పట్టుకుని ఆడించేంతలా! దిలీప్‌ కేవలం హీరోగానే కాకుండా నిర్మాణ వ్యవహారాలలో కూడా దూసుకుపోయాడు. చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చి... తనకన్నా సీనియర్లు, స్టార్లు అయిన మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ లను కూడా నియంత్రించేంత స్థాయికి వెళ్లాడు. అదంతా దిలీప్‌ ధనభలం.

డ్రగ్స్‌ కేసులో మనదగ్గర చోటామోటా సినిమా వాళ్లను మాత్రమే స్టేషన్‌ వరకూ రప్పించగలిగారు. ఈ వ్యవహారంలో బడా నిర్మాతల తనయులు ఉన్నారు, బడా హీరోలే ఉన్నారు.. అనే టాక్‌ వచ్చినా వాళ్లను కవర్‌ చేసేశారు. అయితే కేరళలో మాత్రం బడా హీరోను, సూపర్‌ స్టార్‌ను రేప్‌ కేసులో జైలుకు పంపగలిగారు అంటే.. గొప్ప సంగతే కదా!

ఇప్పుడేం జరుగుతోంది..?

దాదాపు రెండున్నర నెలల పాటు దిలీప్‌ను జైల్లో ఉంచారు కేరళ పోలీసులు. ఈ కేసుపై విచారణకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు అయ్యింది. చాలాసార్లు దిలీప్‌ను సిట్‌ విచారించింది. కేవలం దిలీప్‌నే కాకుండా.. దిలీప్‌ భార్య కావ్య మాధవన్‌ను కూడా విచారించారు పోలీసులు. కుట్ర ఏమిటి, దానిని అమలు చేసింది ఎవరు, వాళ్లకు దక్కింది ఎంత, కుట్ర ఉద్దేశం ఏమిటి, ఆమెపై అత్యాచారం చేసి వీడియోలు తీశారా? వాటిని ఎక్కడ స్టోర్‌ చేశారు? వంటి అంశాల గురించి పోలీసుల విచారణ సాగింది. వీటిలో దేనికీ దిలీప్‌ ఒప్పుకోలేదు అనేది మాత్రం స్పష్టమైంది.

పోలీసులు ఏం అడిగినా.. దిలీప్‌ కామెడీ చేశాడని, వ్యంగ్యంగా, అసంబద్ధంగా, సరదాగా సమాధానాలు ఇచ్చాడని తెలుస్తోంది. సాటి నటిపై అంతకు తెగించిన వాడు విచారణకు సహకరించకపోవడం పెద్ద విషయం కాదు కదా. దిలీప్‌ అలాగే చేశాడట. మరోవైపు వరసగా బెయిల్‌ పిటిషన్లు పెట్టుకొంటూ వచ్చాడు. చివరకు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు తను నిర్దోషిని అని దిలీప్‌ వాదిస్తున్నాడు. మొదటి నుంచి అదే వాదనే అనుకోండి.. బయటకు వచ్చాకా దిలీప్‌ గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు.

పోలీసులు వాట్‌ నెక్ట్స్‌..?

ఈ కేసులో ఇంకా చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఒక విధంగా ఇది పోలీసుల ఫెయిల్యూరే. నటిపై దాడి జరిదింది ఎప్పుడో ఫిబ్రవరిలో.. దాని వెనుక కథేంటనే అంశంపై చాలాకాలం పాటు ఏమీ చెప్పలేకపోయారు పోలీసులు. చివరకు పల్సర్‌ సునీ దిలీప్‌కు ఒక లేఖ రాయడంతో కథ మలుపు తిరిగింది. నటిపై దాడి చేసిన వ్యక్తి పల్సర్‌ సునీ. అతడు దిలీప్‌కు ఒక లేఖ రాశాడు. 'నన్ను అరెస్టు చేసినా నీ పేరు చెప్పలేదు.. కాబట్టి నాకు ఎక్కువ డబ్బు కావాలి..' అంటూ సునీ దిలీప్‌కు లేఖ రాశాడు. 

మరో కేసులో అరెస్ట్‌ అయ్యి, తనతో పాటు జైల్లో ఉండిన వ్యక్తితో సునీ ఆ లేఖను దిలీప్‌కు పంపించాడు. దాన్ని పట్టుకుని దిలీప్‌ పోలీసుల వద్దకు వచ్చాడు.. తను అమాయకుడిని అనీ సునీ తనకు ఈ లేఖ రాశాడని దిలీప్‌ చెప్పాడు కానీ.. అప్పుడు పోలీసులు నట్లు బిగించారు. దిలీప్‌ను నిందితుడిగా చేర్చి కేసులు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇంతవరకూ చార్జిషీట్‌ మాత్రం దాఖలు చేయలేకపోయారు. పూర్తి వివరాలను తాము ఇంతవరకూ సేకరించిన సమాచారాన్ని కోర్టుకు విన్నవించలేకపోయారు. బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పడమే కానీ.. వాటన్నింటినీ సంగ్రహించి కోర్టు ముందు పెట్టలేకపోయారు. చార్జిషీట్‌ దాఖలుకు మరింత సమయం పడుతుంది అనేది పోలీసుల వెర్షన్‌. ఇంకెప్పుడు? చార్జిషీట్‌ దాఖలు చేస్తే కొంతవరకూ విజయం సాధించినట్టే.. ఆ తర్వాత దిలీప్‌ విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 

చార్జిషీట్లో పోలీసులు ఏ మేరకు బలమైన సాక్ష్యాలను సమర్పించగలరు? అనేది ఇంకో ప్రశ్నార్థకం. ఇది అత్యాచారం కేసు కాబట్టి.. సమయం గడుస్తున్న కొద్దీ అన్నీ మారిపోతూ ఉంటాయి. నిందితులు అడ్డం తిరగవచ్చు. సాక్ష్యాలు తారుమారు కావొచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా అనిపిస్తోందంటే.. మరీ బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప దిలీప్‌ను పోలీసులు ఏం చేయాలేరేమో అనే భావన కలుగుతోంది. వీడియోలూ గట్రా దొరికి, ఫోన్‌ సంభాషణలు, దిలీప్‌ సునీకి ఆదేశాలు ఇవ్వడానికి సంబంధించి బలమైన సాక్ష్యాలను పోలీసులు చార్జిషీట్లో పేర్కొనాల్సి ఉంది.

అంత బలమైన సాక్ష్యాలే ఉంటే.. ఈ పాటికి పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేసేవాళ్లు కదా.. అనే సందేహమూ కలుగుతోంది. ఈ కేసులో స్లోగా ప్రొసీడ్‌ అవుతుండటం పట్ల ఇప్పటికే పోలీసులు కోర్టు చేత చీవాట్లు తిన్నారు. మరి ఇదంతా కావాలనే జరుగుతోందా? దిలీప్‌ పోలీసులను మేనేజ్‌ చేస్తున్నాడా? అనే డౌట్స్‌ కూడా పుడుతున్నాయి. 

దిలీప్‌ బెయిల్‌కు అయితే పోలీసులు వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ.. కేసు విచారణలో వేగంలేదు. పోలీసులు ఇంతవరకూ ఇచ్చిన లీకుల ప్రకారం అయితే.. ఈ కేసులో దిలీప్‌ను బిగించేయడానికి బోలెడన్ని టెక్నికల్‌ ఫ్రూప్స్‌ దొరికాయి అని అన్నారు. పోలీసుల తీరులో అంత దూకుడు కనిపించడం లేదు.

ఇండస్ట్రీ ఏమంటోంది...?

ఇప్పుడు మొదట్లో ఉన్నంత వేడిలేదు.. ఇండస్ట్రీలో చాలామంది దిలీప్‌ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. మొదట్లో దిలీప్‌ను నటీనటుల సంఘం నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత నటీనటుల టోన్‌ మారుతూ వస్తోంది. కొంతమంది ప్రముఖ నటులు జైలుకు వెళ్లి దిలీప్‌ను పరామర్శించారు. మరికొందరు బాహాటంగా దిలీప్‌ను సమర్థిస్తున్నారు. ఇక అభిమానులు అయితే సరేసరి. మా హీరోతో పెట్టుకుంటే రేపులైపోతాయి జాగ్రత్త అని వారు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది రాజకీయ నేతలు దిలీప్‌కు మద్దతు పలికారు. దిలీప్‌ను కావాలని కుట్రలో ఇరికించారు అని వారు అంటున్నారు. దిలీప్‌ మాజీ భార్య మంజూవారియర్‌ కుట్ర చేసిందని వారు అంటున్నారు. ఇక దిలీప్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి.. రుజువు కాలేదు కదా.. అని ముఖేష్‌ వంటి సీనియర్‌ నటుడు అంటున్నాడు. దిలీప్‌ జైల్లో ఉన్నప్పుడు సీనియర్‌ నటుడు జయరాం వెళ్లి పరామర్శించాడు. అది కూడా ఓనం పండుగ రోజున ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. సాధారణంగా సెలవు రోజుల్లో ములాఖత్‌లకు అవకాశం ఉండదు. అయినా నిబంధనలను అతిక్రమించి ఓనం రోజున దిలీప్‌ను కలవడానికి జయరాంకు అనుమతిని ఇవ్వడం వివాదంగా నిలిచింది. 

దిలీప్‌ ధీమాగా...

తన కేసును సీబీఐకి అప్పగించాలని అంటున్నాడు దిలీప్‌. అప్పుడే తను నిర్దోషిగా తేలతాను అని అతడు అంటున్నాడు. మరి రేప్‌ కేసులో సూత్రధారి అని కేసును ఎదుర్కొంటున్న నిందితుడు ఇలా సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. మలయాళ నటిపై అత్యాచారం కేసు ఇప్పుడప్పుడే తేలేలా లేదు. అటు ఇటుగా రెండు మూడు దశాబ్దాల పాటు పట్టినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు. పాతికేళ్ల తర్వాత దిలీప్‌ దోషి అనో నిర్దోషి అనో తీర్పు రావొచ్చు. ఆపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకు మిగలవచ్చు!