అరవింద సమేత శాటిలైట్ రైట్స్ ఎవరికి?

టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ మార్కెట్ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. సేమ్ టైం, అతడి సినిమాలకు శాటిలైట్ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇందులో భాగంగా జై లవకుశ సినిమా అత్యధికంగా 14 కోట్ల రూపాయలకు…

టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ మార్కెట్ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. సేమ్ టైం, అతడి సినిమాలకు శాటిలైట్ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇందులో భాగంగా జై లవకుశ సినిమా అత్యధికంగా 14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు అరవింద సమేత సినిమాను అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్మాలని చూస్తున్నాడు నిర్మాత రాధాకృష్ణ (చినబాబు). 

అరవింద సమేత శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు ఇప్పటికే పోటీ మొదలైంది. రేసులో జీ తెలుగు ముందువరుసలో ఉంది. ఈ సినిమా హక్కులు ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో జీ తెలుగు చర్చలు జరుపుతోంది. మరోవైపు జీ తెలుగుకు పోటీగా స్టార్ మా కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ రెండు ఛానెళ్లు రాధాకృష్ణ చెబుతున్న ఎమౌంట్ కు దగ్గరగా లేవు.

అరవింద సమేత శాటిలైట్ రైట్స్ ను 20కోట్ల రూపాయలకు అమ్మాలనేది రాధాకృష్ణ ప్లాన్. అతడి లెక్కలు అతనివి. అజ్ఞాతవాసి చేదు అనుభవాలు రాధాకృష్ణను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తాకొట్టినా శాటిలైట్ రైట్స్ రూపంలో కొంతమేర ఒడ్డున పడొచ్చనేది నిర్మాత ఆలోచన.  

ఛానెళ్లు మాత్రం ఎన్టీఆర్ సినిమాపై 20 కోట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. గత సినిమాకు 14 కోట్లు పలికిన ఎన్టీఆర్ శాటిలైట్ మార్కెట్ ను అమాంతం 50 శాతం పెంచడానికి ఛానెళ్లు ఒప్పుకోవడం లేదు. పైగా ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చిన త్రివిక్రమ్ సినిమాకు 20 కోట్లు పెట్టడాన్ని రిస్క్ గా భావిస్తున్నాయి. 

చర్చలైతే సాగుతున్నాయి. ప్రస్తుతానికి మేటర్ 15 కోట్ల రూపాయల వరకు వచ్చి ఆగింది. ఈ ఎమౌంట్ కు అటుఇటుగా జీ తెలుగు, స్టార్ మా కోట్ చేశాయి. ఈ మొత్తానికి నిర్మాత శాటిలైట్ ను ఇచ్చేస్తాడా.. లేక మహానటి విషయంలో అశ్వనీదత్ చేసినట్టు రిలీజ్ వరకు వెయిట్ చేస్తాడా అనేది చూడాలి. 

రిలీజ్ కు ముందు మహానటి శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు పలకగా.. విడుదల తర్వాత అదే సినిమా శాటిలైట్ ను 15 కోట్లకు అమ్మారు అశ్వనీదత్. అరవింద సమేత విషయంలో రాధాకృష్ణ అంత రిస్క్ చేస్తారని అనుకోలేం.