Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'తెర' వెనుక చీకటి బాగోతం.!

'తెర' వెనుక చీకటి బాగోతం.!

అమెరికాలో మన తెలుగోళ్ళకి చాలా చాలా సంఘాలున్నాయి. ఒకటా? రెండా? లెక్కబెట్టలేనన్ని సంఘాలు వున్నాయి, కొత్తగా ఇంకా చాలా సంఘాలు పుట్టుకొచ్చేందుకూ సిద్ధమవుతున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే పద్ధతిగా నడుస్తున్నాయనీ, చాలావరకు అక్రమంగా నడుస్తున్నవేనన్న ఆరోపణలున్నాయి. ఏది అక్రమం.? ఏది సక్రమం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగు సంఘాల పేరుతో, కుల గజ్జిని మనోళ్ళు అమెరికా గడ్డ మీద కూడా విస్తరింపజేస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ఫలానా హాట్‌ హీరోయిన్‌ని తీసుకొస్తే, ఈవెంట్‌ అదిరిపోతుందనీ.. ఫలానా హాట్‌ యాంకర్‌ని రప్పిస్తే ఈవెంట్‌ రంగ రంగ వైభవంగా సాగుతుందనీ భావిస్తూ, తెలుగు సంఘాలు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందాల భామలకు వల విసురుతున్నారు. ఇందులో కొందరు కేవలం ఈవెంట్స్‌ కోసమే రప్పిస్తోంటే, ఇంకొందరు మాత్రం ఇతరత్రా వ్యవహారాల కోసం రప్పిస్తున్నారు. ఇక్కడే వస్తోంది అసలు చిక్కు అంతా.!

అమెరికాలో తెలుగు సినీ సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూసేసరికి, అంతా అవాక్కయ్యారు. షరామామూలుగానే డిస్కషన్స్‌ షురూ అయ్యాయి. ఆటోమేటిక్‌గా, తెలుగు సినీ పరిశ్రమకి తలనొప్పి కూడా మొదలయ్యింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఈ విషయంపై స్పందించాల్సి వస్తోంది. అమెరికాకి ఈవెంట్ల కోసం వెళ్ళేవారు, ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి సమాచారమివ్వాలంటూ కొత్త ఆదేశాలు మౌఖికంగా జారీ అయ్యాయి.

సినిమాల్లో నటించే తారలకి చాలా వ్యాపకాలు వుంటాయి. షోరూంల ప్రారంభోత్సవాలకు వెళతారు, ఇతరత్రా కార్యక్రమాలకు హాజరవుతారు. అదంతా వారి వ్యక్తిగత విషయం. సినీ సంపాదనకి తోడు, ఇతరత్రా మార్గాల్లో సంపాదనల్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు.? అమెరికాలో ఈవెంట్లు ఇందుకు మినహాయింపేమీ కాదు. అమెరికా అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ మోస్తరు టౌన్స్‌ కూడా ఈవెంట్స్‌కి వేదికలవుతున్నాయి. అక్కడా 'తెరవెనుక బాగోతాలు' నడుస్తున్న సందర్భాలనేకం.

టాలీవుడ్‌ని మీడియా ఈ చర్చ అనబడే రచ్చలోకి లాగింది గనుక, తెలుగు సినీ పరిశ్రమ తరఫున పెద్దలు ఏవో నాలుగు మంచి మాటలు చెప్పారుగానీ, ఆ మాటల్ని పట్టించుకునేవారు ఎంతమంది వుంటారు.? ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అయితే, లిస్ట్‌లో ఎవరున్నారో, వారు అమెరికాకి వెళ్ళొద్దు.. వెళితే అరెస్టవుతారంటూ హెచ్చరించారు. మేటర్‌ ఎంత సీరియస్‌ అన్నది ఆయన మాటల్లోనే అర్థమవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమతో సంబంధం లేని ఇలాంటి వ్యవహారాల్లోకి టాలీవుడ్‌ని లాగడం ఎంతవరకు సబబన్నది మెజార్టీ సినీ ప్రముఖుల అభిప్రాయం. సినీ తారల వ్యవహారమంటే అద్దాల మేడలాంటిదే.. రాయి పడిందంటే, పగలాల్సిందే. తప్పదు.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?