టెంపర్ వివాదానికి దూరంగా ఎన్టీఆర్

“టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనసాక్షికి తెలుసు.., సినిమా రంగంలో నటులు, దర్శకులు, సాంకేతిక…

“టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనసాక్షికి తెలుసు.., సినిమా రంగంలో నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు కోట్లరూపాయలు చెల్లించిన నేను 9లక్షల రూపాయలు చెల్లించలేని స్థితిలో వున్నానా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు…”

చిలికి చిలికి గాలివానగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఇప్పుడు సినిమా మీదకు పాకింది. బండ్లగణేష్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్యతో మరింత దుమారం చెలరేగింది. అసలు టెంపర్ వెనక ఉన్న ఆ శక్తి ఎవరంటూ చర్చ మరోకోణం తీసుకుంది. అయితే ఆ సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించాడు.

ఇటు బండ్ల గణేష్, అటు వక్కంతం వంశీ ఇద్దరూ ఎన్టీఆర్ కు మరీ ఆప్తులేం కాదు, సన్నిహితులు మాత్రమే. అలా అని ఎవరో ఒకరి పక్షం ఉండాలని కూడా తారక్ అనుకోవడంలేదు. ఎందుకంటే పరిశ్రమలో ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసి పనిచేయాల్సి పరిస్థితి వస్తుంది. అందుకే ఈ వివాదంపై తారక్ మౌనంగా ఉండిపోయాడు. నిజానికి ఈ కాంట్రవర్సీపై చిన్న మీటింగ్ పెట్టి మేటర్ సెటిల్ చేయడం ఎన్టీఆర్ కు పెద్ద విషయమేంకాదు. కానీ అలా చేయలేదు. 

అందరితో వివాదరహితుడు అనిపించుకునే ప్రాసెస్ లో ఉన్నాడు ఎన్టీఆర్. తనను ప్రతి ఒక్కరు 'అందరివాడు' అని ఫీలవ్వాలని భావిస్తున్నాడు. పైగా ఈ కేసు కోర్టు పరిధిలో కూడా ఉంది. ఇలాంటి టైమ్ లో కల్పించుకోవడం ఎందుకని తారక్ సైలెంట్ గా ఉండిపోయాడని భావించొచ్చు.

ఎన్టీఆర్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా టెంపర్. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మూసలో కొట్టుకుపోతున్న తారక్ కెరీర్ ను గాడిలో పెట్టింది ఈ సినిమా. ఆ మూవీ తన మైండ్ సెట్ నే మార్చేసిందని పలు సందర్భాల్లో స్వయంగా తారక్ చెప్పుకొచ్చాడు. కానీ ఆ మూవీకి సంబంధించి ఏర్పడిన వివాదానికి మాత్రం అతడు దూరంగా ఉండదల్చుకున్నాడు.