టాప్ టెక్నీషియన్స్ కావాలంటే వాళ్లకు సరైన గౌరవం ఇవ్వడంతో పాటు అడిగినంత పారితోషికం సమర్పించుకోవాల్సిందే. ఈ రెండూ దక్కకపోవడం వల్లనే సైరా ప్రాజెక్టు నుంచి రెహ్మాన్ తప్పుకున్నాడు.
మొన్నటివరకు సైరా నుంచి రెహ్మాన్ తప్పుకున్నాడనేది పుకారు మాత్రమే. కానీ ఇప్పుడా విషయాన్ని రెహ్మాన్ స్వయంగా బయటపెట్టాడు. తనకు మెగాస్టార్ 'సైరా' ప్రాజెక్టుకు ఎంతమాత్రం సంబంధంలేదని స్పష్టంచేశాడు.
“సైరా చాలా పెద్ద సినిమా. చెప్పడానికి ఆ సినిమాలో చాలా విషయం ఉంది. అలాంటి సినిమాకు వర్క్ చేయాలంటే చాలా టైం కేటాయించాలి. ప్రస్తుతానికి నా దగ్గర అంత టైం లేదు.” సైరా నుంచి తప్పుకున్నందుకు రెహ్మాన్ చెప్పిన కారణమిది.
కానీ అసలు విషయం వేరే ఉంది. గతంలో టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ తో పాటు రెమ్యూనరేషన్ సమస్యల వల్ల రెహ్మాన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. సైరా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడు మోషన్ పోస్టర్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అదే టైమ్ లో సినిమాకు రెహ్మాన్ పనిచేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ టైమ్ లో చాలామంది రెహ్మాన్ కు శుభాకాంక్షలు చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. మేకర్స్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో రెహ్మాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత పేమెంట్ విషయంలో కూడా సమీకరణాలు సెట్ కాకపోవడంతో రెహ్మాన్ తప్పుకున్నాడు.
“99 సాంగ్స్” మూవీ ప్రమోషన్ తో పాటు ఇతర లైవ్ కన్సర్ట్ లతో బిజీగా ఉండడం వల్ల సైరా నుంచి తప్పుకున్నట్టు రెహ్మాన్ ప్రకటించాడు. కానీ సైరాకు రెహ్మాన్ సంతకం చేసినప్పుడు కూడా ఆ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. అప్పుడు అతడికి లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, దానికి కారణం రెమ్యూనరేషన్ అనే అనుకోవాలి.