ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ నెపాన్ని పక్కోడి మీదకు తోసేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఈ సూత్రం టాలీవుడ్ కే కాదు, బాలీవుడ్ కు కూడా వర్తిస్తుంది. ట్యూబ్ లైట్ సినిమా విషయంలో ఇలాంటి పంచాయతీనే నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొందరు షారూక్ ను ఫ్లాప్ కు బాధ్యుడిగా చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో సల్మాన్ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఒక్క ట్యూబ్ లైట్ మినహా. ఎందుకంటే ట్యూబ్ లైట్ లో షారూక్ ఉన్నాడు కాబట్టి. వెర్రి అభిమానుల నయా సెంటిమెంట్ అస్త్రం ఇది. కేవలం షారూక్ అడుగుపెట్టడం వల్లనే ట్యూబ్ లైట్ పేలిపోయిందంటున్నారు.
అలా షారూక్ ను తెరపైకి తెచ్చి సల్మాన్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి షారూక్ వర్గం కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తోంది. తమ హీరో ఉన్నాడు కాబట్టే ట్యూబ్ లైట్ కు ఆ మాత్రమైనా వసూళ్లు వస్తున్నాయని వాదిస్తున్నారు. అభిమానుల వాదనలు ఎలా ఉన్నప్పటికీ ట్యూబ్ లైట్ మాత్రం ఫ్లాప్ అయింది.
మరోవైపు షారూక్ సినిమాలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరక్ట్ చేస్తున్న షారూక్ కొత్త సినిమాలో వీళ్లిద్దరూ ఓ పాటలో కలిసి డాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షారూక్, సల్మాన్ కలిసి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. మరి ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆ తప్పును సల్మాన్ పై నెడతారేమో పిచ్చి అభిమానులు.