చైనా ఫోను.. చైనా రైసు.. మానేద్దామా.!

అంతా 'చైనా' మయం. చైనా ఫోను, చైనా బైకు, చైనా బొమ్మ.. ఆఖరికి తినే అన్నం కూడా చైనా రైస్‌తో చేసిందే.! భవిష్యత్‌ ముఖచిత్రం అత్యంత భయానకంగా కన్పిస్తున్నాసరే, మనం చైనా జపం మానడంలేదు.…

అంతా 'చైనా' మయం. చైనా ఫోను, చైనా బైకు, చైనా బొమ్మ.. ఆఖరికి తినే అన్నం కూడా చైనా రైస్‌తో చేసిందే.! భవిష్యత్‌ ముఖచిత్రం అత్యంత భయానకంగా కన్పిస్తున్నాసరే, మనం చైనా జపం మానడంలేదు. చైనా రైస్‌కి సంబంధించి ఇప్పటిదాకా జరుగుతున్నదంతా ప్రచారమేనని అధికారులు కొట్టిపారేస్తున్నారు. అయినాసరే, చైనా రైస్‌ తాలూకు ఆనవాళ్ళు మాత్రం కన్పిస్తూనే వున్నాయి. ఎందుకిలా.? ఏమో మరి, అది దైవ రహస్యం అనుకోవాలంతే. 

చైనా మీద మన దేశం అలా ఇలా ఆధారపడటంలేదు, చాలా దారుణంగా ఆధారపడ్తోంది. చైనా మొబైల్‌ పోన్లు, దేశ భద్రతకు పెను శాపంగా మారాయని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. భద్రతా సిబ్బంది, ముఖ్యమైన అధికార యంత్రాంగం చైనా తయారీ మొబైల్‌ ఫోన్లను వాడొద్దంటూ అప్పట్లో ఆదేశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వ్యవహారం మళ్ళీ షరామామూలే. ఇంతకీ, చైనా మొబైల్స్‌ సేఫేనా.? ఆ ఒక్కటీ అడక్కూడదు. 

చైనా బొమ్మలు అత్యంత ప్రమాదకరం. కారణం, వాటిల్లో విషపూరిత రసాయనాల్ని వినియోగించడమే. కానీ, మార్కెట్‌లో విచ్చలవిడిగా చైనా బొమ్మలు దొరుకుతున్నాయి. పసిపిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాలు నిషేధించవు, ప్రజలు వాటిని వినియోగించడమూ మారరు. ఎందుకంట.? దీనికీ సమాధానం దొరకదు. 

ఇలా చెప్పుకుంటూ పోతే, కథ చాలానే వుంటుంది. అయినాగానీ, చైనా వస్తువుల్ని నిషేధించాల్సిందేనంటూ డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఈసారి, డ్రాగన్‌ దేశం, మన మీద దండెత్తేందుకు సిద్ధంగా వుండడంతోనే ఈ ఆవేశం. సోషల్‌ మీడియాలో చైనా వస్తువుల నిషేధంపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొన్ని రాజకీయ పార్టీలేమో ఇప్పుడు జెండాలు పట్టుకుని, చైనా తయారీ వస్తువుల్ని బ్యాన్‌ చేయాలని రోడ్డెక్కుతున్నారు. 

చైనాతో భారత్‌కి వివాదాలున్నట్టే, ఆర్థిక సంబంధాలున్నాయి. ఎగుమతులు దిగుమతులు గట్టిగానే జరుగుతున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు, మొన్నటికి మొన్న పెద్ద పాత నోట్ల రద్దు.. అంటూ ప్రధాని నరేంద్రమోడీ, వీరావేశంతో చేసిన ప్రకటన, ఆ తర్వాత 'డిజిటల్‌ మనీ..' అంటూ చేసుకున్న ప్రచారం.. 'మేకిన్‌ ఇండియా' అంటూ ఇచ్చిన నినాదం.. ఈ తతంగమంతా, చైనా తయారీ స్వైపింగ్‌ మెషీన్ల కోసమే అయ్యింది. పాలకుల్లో చిత్తశుద్ధి ఈ స్థాయిలో వుంటే, చైనా రంకెలెయ్యకుండా వుంటుందా.?