బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా మారిన రోజులవి. అదే టైమ్ లో స్పైడర్ మూవీకి శ్రీకారం చుట్టాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ స్పైడర్ పై కచ్చితంగా పడుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. నష్టాలు తగ్గించుకునేందుకు మీడియం రేంజ్ బడ్జెట్ లో స్పైడర్ ను తీస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. మేకర్స్ కూడా అలానే అనుకున్నారు. తీరా సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే 120కోట్ల రూపాయల లెక్క తేలింది.
బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత 120కోట్ల బడ్జెట్ తో స్పైడర్ లాంటి సినిమా చేయడం చాలా పెద్ద రిస్క్. అంతా కలిసి ఆ రిస్క్ కు మూల్యం చెల్లిస్తున్నారిప్పుడు. సినిమాకు మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ మొదలైంది. అలా రోజులు గడిచేకొద్దీ బజ్ తగ్గిపోయింది. సినిమా తేలిపోయింది.
నిజంగా స్పైడర్ సినిమాను ఉన్నంతలో మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసి ఉంటే, కచ్చితంగా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లి ఉండేది. రిజల్ట్ సంగతి పక్కనపెడితే దసరా సీజన్ యాడ్ అయింది కాబట్టి సినిమా సేఫ్ జోన్ లో ఉండేది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. పైపెచ్చు “నాకు ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ పెరుగుతోంది” అంటూ మహేష్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చుకున్నాడు.
కళ్ల ముందు బ్రహ్మోత్సవం, స్పైడర్ రూపంలో రెండు చేదు అనుభవాలున్నాయి. మరోవైపు సెట్స్ పై భరత్ అనే నేను ప్రాజెక్టు నడుస్తోంది. మరి ఈసారైనా బడ్జెట్ పై నియంత్రణ సాధిస్తారా..? లేక మరోసారి మహేష్ స్టార్ డమ్ ను గుడ్డిగా నమ్మి కోట్లకు కోట్లు కుమ్మరిస్తారా..?
మహేష్ కు సంబంధం లేకుండా ఈ మొత్తం వ్యవహారం సాగుతోందని చెప్పలేం. తన సినిమాలకు బడ్జెట్ పెరిగిపోతోందనే విషయం అతడికి తెలియంది కాదు. తను కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకొని, బడ్జెట్ తగ్గించండని ఒక్క మాట చెబితే చాలు అన్నీ సర్దుకుంటాయి. కానీ మహేష్ చెప్పడు, నిర్మాతలు ధైర్యం చేసి అడగలేరు. సమస్య అంతా ఇక్కడే వస్తోంది.