డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు జారీ అయిన వారి జాబితాలో ఉన్న సినీ దర్శకుడు పూరీజగన్నాథ్ ను అరెస్టు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కెల్విన్ ను కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు అతడిని విచారించగా.. మళ్లీ పూరీ, నటి చార్మి పేర్ల ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది వరకే వీళ్ల గురించి కెల్విన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
కెల్విన్ అరెస్టును చూపించిన అనంతరం, తిరిగి న్యాయస్థానం అనుమతితో అతడిని విచారించడం మొదలుపెట్టారు పోలీసులు. పూరీ పేరు కేవలం డ్రగ్స్ వినియోగదారుడిగానే కాకుండా, డ్రగ్స్ పంపిణీ దారుడిగా కూడా ఉందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి అరెస్టు కూడా జరగవచ్చని అంటున్నారు. కొన్ని మీడియా వర్గాలు పూరీ పేరును రాస్తుండగా, మరికొన్ని ఒకవర్గాలు ఓ దర్శకుడు, ఓ నటి.. అంటూ పూరీ, చార్మిల గురించి కథనాలు ఇస్తున్నాయి.
మరి టాలీవుడ్ లో మొత్తం 40మందికిపైగా డ్రగ్స్ వినియోగదారులు ఉండగా.. వారిలో కొన్ని పేర్లే బయటకు రావడంతోనే ఈ విషయంలో పోలీసుల, ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతుంది. ఒక ప్రముఖ నిర్మాత ఇద్దరు తనయులకూ డ్రగ్స్ అలవాటు ఉంది… అయితే వారి పేర్లను మాత్రం బయటపెట్టడం లేదు.. అనే వాదనా వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితం అయిన సినిమా వాళ్ల పిల్లల పేర్లు బయటకు రావడం లేదని, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడిలేని వాళ్ల పేర్లే బయటకు వచ్చాయనే మాట వినిపిస్తోంది. సామాన్య ప్రజానీకం కూడా ఈ విషయాన్నే నమ్ముతున్నారు. పూరీ, రవితేజ, సుబ్బరాజు.. ఇలాంటి వాళ్ల పేర్లు మాత్రమే బయటకు రావడం.. ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి చెందిన వాళ్ల పేర్లను అండర్ కవర్ లోనే ఉంచారని.. బయటకు వెళ్లడించడం లేదనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
వాళ్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దల సామాజికవర్గానికి చెందిన వాళ్లు కాకపోయినా.. తమ ఇన్ ఫ్లుయన్స్ ను బలంగా కలిగిన వారు కావడంతో.. వాళ్ల పేర్లు బయటకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూరీ అరెస్టు కూడా జరిగితే ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకునే అవకాశం ఉంది.