బాహుబలి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమని స్థాయిని పెంచిన రాజమౌళి ఆ చిత్రంతో టాలీవుడ్‌లో తెచ్చిన మార్పులంటూ ఏమీ లేవు. అంతటి బృహత్తరమైన ప్రయత్నాలని చేసేంత ఓపిక, సహనం, ధైర్యం ఎక్కువమందికి లేకపోవడంతో అటువంటివి ఎవరూ తలపెట్టడం లేదు. బాహుబలి కంటే కూడా రాజమౌళి చేయబోతున్న నందమూరి-కొణిదెల మల్టీస్టారర్ వల్ల చిత్ర పరిశ్రమలో పెను మార్పులు రాబోతున్నాయి.
ఫాన్ వార్స్ కారణంగా కొన్ని దశాబ్ధాలుగా సరయిన మల్టీస్టారర్లు తెలుగు చిత్ర పరిశ్రమలో రాలేదు. డెబ్బయ్‌లలో, ఎనభైలలో వచ్చిన లాంటి మల్టీస్టారర్లు ఎవరూ అటెంప్ట్ కూడా చేయలేదు. చిరంజీవి-బాలకృష్ణ, నాగార్జున-వెంకటేష్, పవన్-మహేష్ లాంటి కాంబినేషన్లు అన్నీ ఊహలకే తప్ప నిజం కాలేదు. దీంతో కథల పరంగా కొరత ఏర్పడింది. ఇద్దరు హీరోలుంటే కథలు మారతాయి, మార్కెట్ డైనమిక్స్ మారతాయి.
ఇదంతా తెలిసినప్పటికీ ఇద్దరు స్టార్ హీరోలని కలిపేందుకు ఎవరూ తెగువ చూపించలేదు. కానీ రాజమౌళి కారణంగా అది సాధ్యమవుతోంది. ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసే ఈ చిత్రంతో రానున్న రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్లకి తెర లేస్తుంది. ఇంతకాలం ఇలాంటి సినిమాలపై వున్న రిజర్వేషన్లు తొలగిపోయి హీరోలు సైతం బ్రాడ్ మైండ్‌తో ఆలోచించడానికి, దర్శకులు ఈ దిశగా కథలు రాసుకోవడానికి ఆస్కారం వుంటుంది. అందుకే తెలుగు సినిమా పరంగా రాజమౌళి తలపెట్టింది విప్లవాత్మక చిత్రమేనని చెప్పాలి.