''..నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు, ఆ చూపులను అలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు…'' పాటలో ఈ పంక్తులు వినగానే ఎవరైనా ముందుగా అడిగేది, ఇంత భావుకతతో రాసింది ఎవరు అనేగా. కానీ సినిమా నిర్మాతలు మాత్రం ఆ సంగతి తప్ప అంతా చెప్పారు. యూట్యూబ్ లో పాట లోడ్ చేసి, కింద వివరాలు ఇచ్చినపుడు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ చేసిన వారి పేరు దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ పేరు వుంది, ఒక్క పాట రాసిన వారి పేరు తప్ప?
పాట ఇంకా పూర్తిగా విడుదల చేసి వుండొకపోవచ్చు, విడుదల చేసినపుడు వేస్తే సరిపోతుంది అనుకుని వుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ బిట్ వదిలినపుడు కూడా నటించిన నటుల పేర్లు అన్నీ వేసారు, ఎడిటర్, ఆర్ట్ డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరి పేర్లు వేసారు. ఆఖరికి పాటతో సంబంధం లేని స్టంట్ మాస్టర్ పేరు కూడా వేసారు.
ఒక్క పాట రాసిన రచయిత పేరు తప్ప. ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చిన్నా చితక రైటర్ గాదు. పైగా దర్శకుడు త్రివిక్రమ్ కు ఆప్తుడు, బంధువు కూడా. ఆయన పేరే మరిచిపోయారంటే ఇంకేం చెప్పాలి.