ఈ ఏడాది ఇప్పటి వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరద నీరు 1220 టీఎంసీలు అని జలవనరుల శాఖ తేల్చింది. ఇందులో శ్రీశైలం నిల్వ సామర్ధ్యం చాలా చాలా తక్కువ. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వెళ్లి, అక్కడ కొద్ది మేర నిల్వ అయ్యి, ఆ పై పులిచింతల్లో కొన్ని టీఎంసీలు నిల్వ జరిగి.. చివరకు సముద్రానికి చేరిన నీటి లెక్క దాదాపు 460 టీఎంసీలు అని తెలుస్తోంది!
ఒక్క కృష్ణా నది ద్వారా సముద్రంలోకి కలిసిన నీరే 460 టీఎంసీలు. ఆ నీటిలో సగమయిన రాయలసీమ కు అందే మార్గం ఉండి ఉంటే.. ఆ ప్రాంతానికి అంతకన్నా వేరే అవసరం ఉండేది. జగన్ హయాంలో అయినా ప్రభుత్వం కొద్ది మేర మేల్కొన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం నుంచి రాయలసీమ వైపుకు కనీసం వరద సమయాల్లో అయినా నీటి లభ్యతను పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈ ఏడాది కృష్ణా నది ద్వారా నీటి లభ్యత రికార్డు స్థాయికి చేరింది. ఇప్పటికే 1200 టీఎంసీలను మించిన ప్రవాహానికి ఇంకా ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అక్టోబర్, నవంబర్ లలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉండనే ఉంది. తుఫాన్లూ గట్రా పట్టుకుంటే.. మళ్లీ భారీ వర్షాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. గత సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు అక్టోబర్, నవంబర్ లలోనే భారీగా నీరు లభించింది. ఈ సారి కూడా అదే జరిగితే.. కొత్త రికార్డు ఖాయమే అని చెప్పాలి.
చివరి సారి.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. 2007-08 సంవత్సరాల్లో 1200 టీఎంసీల వరద శ్రీశైలం ప్రాజెక్టును చేరుకుంది. జగన్ హయాంలో ఆ రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి!