ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్వాతంత్రం కోసం పోరాడిన తొలితరం యోధుడు, లక్షలాది ప్రజల్ని ఒక్కటి చేసి, వారి మద్దతుతో బ్రిటిష్ వారిపై దండెత్తిన పోరాటవీరుడు. మరి అలాంటి గొప్ప పాత్రలో నటించిన చిరంజీవి మాత్రం నిజ జీవితంలో ఓటమి పాలైన ఓ నాయకుడు. ఓటమిని జీర్ణించుకోలేక పార్టీని సైతం తెగనమ్మేసి మధ్యలోనే మడమతిప్పిన “వీరుడు”. సహజంగా ఇప్పుడిలాంటి పోలిక వచ్చేది కాదు, కానీ కావాలనే చిరంజీవి ఈ కంపేరిజన్ కొని తెచ్చుకున్నట్టయింది.
రజనీకాంత్, కమల్ హాసన్ కి ఉచిత రాజకీయ సలహాలు పారేసి చిరంజీవి తన అసమర్థతను మరోసారి బయటపెట్టుకున్నారు. సలహా ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ చిరంజీవి వారిని రాజకీయాల్లోకి రావద్దనడానికి చెప్పిన కారణమే మరీ చీప్ గా ఉంది. ప్రజల్ని తక్కువచేసి మాట్లాడిన చిరంజీవి విధానం జుగుప్సాకరంగా ఉంది. రాజకీయాలు డబ్బుమయం అయిపోయాయి, నా ప్రత్యర్థులు కోట్లు కుమ్మరించి నన్ను ఓడించారు, నా తమ్ముడికి కూడా ఇలాగే జరిగింది, అందుకే మీరు (రజనీ, కమల్) రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ మాటతోనే ప్రజల్ని తీవ్రంగా అవమానించారాయన.
కోట్లు కుమ్మరిస్తే ఓట్లు పడిపోతాయనుకునే భ్రమల దగ్గరే చిరంజీవి ఆగిపోయారు. ఆ మధ్య పవన్ కల్యాణ్ కూడా తాను ఓడిపోయిన రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎంతెంత ఖర్చుపెట్టారో లెక్కతీశారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఎంతకి అమ్ముడుపోయారో చెప్పారు. కేవలం డబ్బులిచ్చినవారికే ప్రజలు ఓటేస్తారనుకుంటే.. భవిష్యత్ లో పవన్ పోటీ చేయాల్సిన అవసరమే లేదు. హాయిగా వెళ్లి సినిమాలు చేసుకోవచ్చు. మరి పవన్ ఎందుకింకా జనసేన నడిపిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో అయినా గెలుస్తామనే ఆశ.
అలాంటి ఆశ, ఓపిక లేకే చిరంజీవి రాజకీయాల్ని వదిలేశారు. వదిలేస్తే వదిలేశారు.. ఇలా తనకు మూడొచ్చినప్పుడల్లా, తనకు కావాల్సిన వారికి ఉచిత సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడల్లా చిరంజీవి ప్రజల్ని కించపరచడం మాత్రం సరికాదు. రాజకీయాలు డబ్బు మయమైపోయాయనేది వాస్తవమే. ఎవరూ కాదనలేని సత్యమే. కానీ డబ్బు ఉంటేనే గెలుస్తాం అనేలా చిరంజీవి మాట్లాడ్డం సరికాదు.
అలా అనుకుంటే ప్రతిసారి అధికారపక్షమే తిరిగి అధికారంలోకి రావాలి కదా. అధికారంలో ఉన్నన్ని రోజులు కూడబెట్టిన కోట్ల రూపాయలు ఖర్చుచేసి తిరిగి అదే పార్టీ మళ్లీ గద్దనెక్కాలి. అలా ఎక్కడా జరగడంలేదు, మరి అలాంటప్పుడు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతున్నారు, ప్రత్యర్థులు కోట్లు కుమ్మరించి మమ్మల్ని ఓటమిపాలు చేశారనే చిరంజీవి వాదనలో పసలేదు.
ఇకనైనా మెగా బ్రదర్స్ ఓటర్లను చులకనగా చూడటం మానుకోవాలి. తమలో ఉన్న లోపాలు తెలుసుకొని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. స్వాతంత్రయోధుడి జీవితాన్ని సినిమాగా చేస్తే సరిపోదు, స్వతంత్ర్య భారతావని ఆశయాల్ని, విలువల్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి.