వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ సినిమా ప్రారంభించినపుడే సంక్రాంతికి విడుదల అన్నది బయటకు వచ్చింది. ఇన్నాళ్లూ ఈ సినిమా సంక్రాంతికి అనే వినిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఓ మూడు వారాలు ముందుకు వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి పోటీలోంచి స్వచ్చందంగా తప్పుకుంది.
వైఎస్ బయోపిక్ సినిమా జగన్ బర్త్ డే డేట్ ను విడుదలకు డేట్ గా ఎంచుకుంది. డిసెంబర్ 21న యాత్ర విడుదలవుతుంది. ఇంతకీ సంక్రాంతి పోటీలోంచి యాత్ర ఎందుకు తప్పుకున్నట్లు? అధికారికంగా ప్రకటించకపోయినా, పదే పదే సంక్రాంతికి పక్కా అంటూ వచ్చిన యాత్ర మేకర్లు ఇప్పుడు మనసు ఎందుకు మార్చకున్నట్లు?
2019 సంక్రాంతి ఫుల్ ఫ్యాక్డ్ గా వుండేలా కనిపిస్తోంది. రామ్ చరణ్-బోయపాటి సినిమా ఒకటి ఇప్పటికే జనవరి 9న డేట్ ఇచ్చివుంది. బాలయ్య-ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి విడుదల. ఇక ఇవికాక, దిల్ రాజు నిర్మించే మల్టీ స్టారర్ ఎఫ్-2 కూడా సంక్రాంతికే విడుదల.
ఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ కు ఏ కాంపిటీషన్ లేకుండా చేయాలనే ప్రయత్నాలు షురూ అయ్యాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మీద గౌరవంతో ఆ సినిమాకు పోటీ పెట్టకూడదనే అభిప్రాయాన్ని మెల్లగా ఇండస్ట్రీలోకి పంపిస్తున్నారు. కానీ బోయపాటి-రామ్ చరణ్ సినిమా తప్పేలాలేదు. దిల్ రాజు-అనిల్ రావిపూడి-వెంకీ-వరుణ్ తేజ్ ల ఎఫ్-2ను మాత్రం కాస్త వెనక్కు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి.
దిల్ రాజుకు అయినా నైజాంలో థియేటర్లు ఇవ్వాలంటే సురేష్ బాబు-సునీల్ నారంగ్ నే. అందుకే ఏదోలా ఎప్-2కు మాత్రం బ్రేక్ వేస్తారని వినిపిస్తోంది. ఇలాంటి నేఫథ్యంలో యాత్ర సినిమా మూడువారాలు ముందుకు వచ్చేయడం అన్నది ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వినిపిస్తున్న వార్తలకు ఊతం ఇచ్చేలా వుంది.