నాది కాకపోతే కాశీ దాకా డేకేసినా ఫర్వాలేదు అనే జనాలు ఇండస్ట్రీలో ఎక్కువగా వుంటారు. ముఖ్యంగా డైరక్టర్లు. తమ సబ్జెక్ట్, తమ టేకింగ్, తమ సరదా, ఇవే తప్ప సినిమా స్టామినా, హీరో స్టామినా లాంటి ముందు వెనుక విషయాలు అంతగా చూడరు. నవంబర్ 3న విడుదల కాబోతున్న గరుడవేగ సినిమా వ్యవహారం ఇలాంటిదే.
సబ్జెక్ట్ మంచిది కావచ్చు, టేకింగ్ భారీగా తీసి వుండొచ్చు. కానీ ఏం లాభం, హీరోగా రాజశేఖర్ వున్నారు. ఆయన మార్కెట్ ఏమిటన్నదానిపై ఇప్పటికీ ఓ అంచనా లేదు. ఆయన ఏలా చేసారు అన్నది తెలియదు. టీజర్, ట్రయిలర్లలో ఓకె. సినిమాలో ఎలా వుందో చూడాలి.
అలాంటి సినిమా కోసం పాపం, ఆ నిర్మాత పాతిక కోట్లు ఖర్చు చేసేసారట. దర్శకుడు ప్రవీణ సత్తారు తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది. భారీ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్ లు, ఛేజ్ లు, అంతా హాలీవుడ్ స్టయిల్, విదేశాల్లో నిర్మాణం. దాంతో డబ్బులు మంచి నీళ్లలా ఖర్చుచేసేసారు. దీనికి తోడు కాస్త ఎక్కువ నెంబర్లలోనే థియేటర్లు బ్లాక్ చేసారు.
కానీ సినిమాను అమ్మడం అంత వీజీ కాదు. నైజాం ఏరియాకు మల్కాపురం శివకుమార్ ఓ కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, విడుదల చేస్తున్నారు. మరి సీడెడ్, ఆంధ్ర? కనీసం రెండు మూడు కోట్లు కావాలి విడుదల చేయాలంటే.
దాని కోసమే ఇప్పుడు నిర్మాత కిందా మీదా అవుతున్నారు. ఎవరైనా కాస్త అడ్వాన్స్ ఇచ్చి ఆడిస్తారేమో అని. కావాలంటే సినిమా బాగా వచ్చింది. చూపిస్తా అంటున్నారని కూడా వినికిడి.
ఇంత ఖర్చు, ఇంత టేకింగ్ అన్నపుడు హీరోను కూడా కాస్త చూసుకుని వుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో?