వైకాపాలో సినీబాంధ్యవులు

రాను రాను ఆంధ్రలో ఎన్నికల వేడి అందుకుంటోంది. ఒక్కో చోట జనాలు ఏటో అటు క్లియర్ గా మొగ్గడం అన్నది కనిపిస్తోంది. అదే విధంగా పార్టీలు కూడా నాయకులను చేరదీయడం ప్రారంభమైంది. సాధారణంగా సినిమా…

రాను రాను ఆంధ్రలో ఎన్నికల వేడి అందుకుంటోంది. ఒక్కో చోట జనాలు ఏటో అటు క్లియర్ గా మొగ్గడం అన్నది కనిపిస్తోంది. అదే విధంగా పార్టీలు కూడా నాయకులను చేరదీయడం ప్రారంభమైంది. సాధారణంగా సినిమా జనాలు కూడా రాజకీయాలు అంటే మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతానికి కొత్త కొత్త సినిమా బాంధవ్యం వున్నవారు రాజకీయాల్లోకి దూకుతున్నారు.

గీతాంజలి, లక్కున్నోడు సినిమాలు తీసి, ప్రస్తుతం ఆది-తాప్సీలతో ఓ సినిమా, గీతాంజలి 2 అంటూ మరో సినిమా నిర్మిస్తున్న ఎంవివి సత్యనారాయణ వైకాపా తీర్థం తీసుకున్నారు. ఆయన విశాఖలో బడా బిల్డర్. అక్కడి ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ మధ్యనే వైకాపాలో చేరారు. ఆయనకు ఇప్పుడు ఏకంగా నియోజక వర్గ సమన్యయ కమిటీ చైర్మన్ పదవిని కూడా పార్టీ అందించింది.

తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా వర్తమాన రాజకీయాలపై సదా అలెర్ట్ గా వుండే హీరో నిఖిల్ కు కూడా పరోక్షంగా వైకాపా బంధాలు అలుముకున్నాయి. నిఖిల్ స్వంత బావ తండ్రి అయినా ఆర్ కొండయ్య కూడా వైకాపాలో చేరారు. ఆయన ప్రకాశం జిల్లాలోని ఓ నియోజక వర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఆయన ఆంధ్ర అంతటా రియల్ ఎస్టేట్ వెంచర్లతో ఆర్కే టౌన్ షిప్ ల పేరిట పాపులారిటీ సంపాదించారు.

తెలుగునాట కాస్త పాపులారిటీ వున్న తెలుగు సినిమా వెబ్ సైట్ అధినేతకు కూడా వైకాపా టికెట్ ఖరారయినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తారు. గత ఎన్నికల తరువాత ఆయన కొంతకాలం తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక మళ్లీ వైకాపాలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకు కూడా జగన్ టికెట్ ఇస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

దర్శకుడు వివి వినాయక్ కూడా వైకాపాలోకి వెళ్తారని, ఎన్నికలు దగ్గర చేసి ప్రకటిస్తారని ఓ టాక్ వుంది. అయితే దాన్ని వినాయక్ అంగీకరించలేదు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం వుందని, కానీ ఏదీ డిసైడ్ చేసుకోలేదని ఆయన అంటున్నారు.

హీరో మోహన్ బాబు నేరుగా వైకాపా తరపున రంగంలోకి దిగుతారని టాక్ వుంది. దగ్గర చేసి కానీ ఏ సంగతీ క్లారిటీ రాదు.

నిర్మాత సుబ్బరామిరెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్ మనిషి. ఆయన మళ్లీ ఈసారి కూడా అదే పార్టీ మీద బరిలోకి దిగుతారా? ఆగుతారా? చూడాలి.

నిర్మాత పివిపి కి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి వుంది. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి కచ్చితంగా వైకాపా తరపున పోటీలోకి దిగుతారని వినిపిస్తోంది.
నిర్మాత రామ్ తాళ్లూరి జనసేన తరపున యాక్టివ్ గా వున్నారు. 

ఇవన్నీ ఇలా వుంచితే ఎన్నికలు దగ్గరకు వచ్చాక ఇంకా చాలా మంది బయటకు వస్తారని, పోటీకి దిగుతారని తెలుస్తోంది.