అనుకున్న తేదీకి విడుదల కాలేని సినిమాలు బోలెడన్ని ఉంటాయి. అనేక రకాల అవాంతరాలతో వివిధ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావు. అలా విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలు బోలెడన్ని ఉంటాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల కెరీర్ లలో కూడా అలాంటి సినిమాలు ఉండనే ఉంటాయి! ఇక చిన్న, ఓ మోస్తరు హీరోలకు కొన్ని సినిమాలు తలనొప్పిగా మారుతుంటాయి. విడుదల తేదీలు ప్రకటించడం, ఆ తర్వాత ఏదో కారణం రావడం.. విడుదల ఆగడం.. ఇదంతా కొన్ని సినిమాల విషయంలో సీరియల్ లా కొనసాగుతూ ఉంటుంది.
అలాంటి అనేక ఆటంకాలతో కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి దాదాపుగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు అందుకు మినహాయింపు! ఆటంకాలతో విడుదల అయినా అదుర్స్ అనిపించుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఢీ!
మల్లిడి సత్యనారాయణ రెడ్డి అనే నిర్మాత. అంతకు ముందు అల్లు అర్జున్ తో బన్నీ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దానికన్నా ముందు రవితేజతో భగీరథ అనే ఒక సినిమాను రూపొందించాడు. భగీరథ సినిమా ఆడలేదు. బన్నీ మాత్రం ఫర్వాలేదు. ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా ఆయన ప్రొడక్షన్లో శీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ' సినిమా మొదలైంది. ఈ సినిమా రెడీ అనే వార్తలు 2006లోనే వచ్చాయి. అయితే 2007 సమ్మర్ కు గానీ ఈ సినిమా విడుదల కాలేదు. అప్పటికి విష్ణు అంత ఫామ్ లో లేడు, శీను వైట్ల అంతకు ముందు తీసిన 'వెంకీ' టీవీల్లో ఆడింది కానీ, థియేటర్లో కాదు. 'అందరివాడు' కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కాబట్టి ఎలాంటి అంచనాలు లేవు 'ఢీ' మీద.
అందులోనూ విడుదలలో జాప్యం. కానీ అనూహ్యమైన మౌత్ టాక్ తో ఈ సినిమా ఫేట్ మారిపోయింది. శీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ ల దశ తిరిగిపోయింది. బ్రహ్మానందం కు కొత్త ఊపు వచ్చింది. బొమ్మరిల్లు తర్వాత జెనీలియాకు ఢీ ఒక సూపర్ హిట్ గా నిలిచింది. విష్ణు కెరీర్ ఢీ కి ముందు ఢీ తర్వాత ఆ స్థాయి హిట్ లేదు. మోహన్ బాబు తనయుడి కెరీర్ అయితే పుంజుకుంది ఆ సినిమాతోనే.
సరిగ్గా 13 యేళ్ల కిందట, ఏప్రిల్ 13నే విడుదల అయ్యిందట ఢీ. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల సోషల్ మీడియాలో ప్రస్తావించాడు. ప్రస్తుతం వైట్లకు సరైన హిట్ లేని స్థితిలో ఉన్నాడు. కోన వెంకట్ పరిస్థితి కాస్త అటూ ఇటూగానే ఉంది. విష్ణు కూడా అంతే. జెనీలియా సినిమాలకు దూరం అయ్యింది. శ్రీహరి భౌతికంగా లేరు. బ్రహ్మానందం, భరత్ ల ఊపు కూడా ఆ స్థాయిలో లేదు.
ఢీ హిట్ అయిన తర్వాత ఆ ట్రెండ్ మరో 50 సినిమాల వరకూ వచ్చి ఉంటాయి. శీనువైట్ల, కోన వెంకట్ లే 'ఢీ' ఫార్ములాతో చెరో అరడజను సినిమాలు చేసి ఉంటారు. దాదాపు పదేళ్లు ఢీ ట్రెండ్ లో వచ్చిన సినిమాల హవా కొనసాగింది. గత మూడేళ్లలో అలాంటి సినిమాలను జనాలు పూర్తిగా తిరస్కరిస్తూ వస్తున్నారు. అయినా హీరోయిన్ ఇంట్లో హీరో చేరి బకరాలను అడ్డం పెట్టుకుని హంగామా చేసే ఫార్ములా మాత్రం ఇప్పటికీ టాలీవుడ్ వదులుకోలేదేమో!