కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పనులన్నీ పక్కన పెట్టి ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు కదా! ముందు కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటే తర్వాత సంపాదించుకోవచ్చనే ఆలోచన ప్రతి ఒక్కరిదీ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు…కరోనా దెబ్బతో ప్రతి వ్యక్తి ఎంతోకొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. అయితే కరోనాకు మందులు లేకపోవడంతో దానికి దూరంగా ఉండటం ఒక్కటే రక్షణ మంత్రమైంది.
దీంతో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు తమ చేతికి పని చెబుతున్నారు. వంటింటి ప్రయోగాలు చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్, అందాల తార పూజా హెగ్డే కూడా వంటింటి ప్రయోగాల్లో నిమగ్నమయ్యారు. అలాగే ‘లాక్ డౌన్ పూర్తయ్యేసరికి గిటార్ నేర్చుకుంటా’ అని గిటార్ నేర్చుకుంటున్న ఫొటోను ఇటీవల పూజా హెగ్డే షేర్ చేసింది. వంట వేళలో కాకుండా మిగిలిన తీరిక సమయాన్ని ఆమె మనసుకు ఆహ్లాదాన్ని పంచే సంగీత సాధనలో నిమగ్నమయ్యారు.
ఇక వంట విషయానికి వస్తే ఇటీవల ఆమె హల్వా చేశారు. ఇప్పుడు తన తల్లి లత కోసం పిజ్జా చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు. అదేంటంటే…‘మా చిన్నతనంలో అమ్మ మా కోసం పిజ్జా చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మ కోసం నేను పిజ్జా చేయగలుగుతున్నానని చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ తొలగించగానే ఎప్పట్లానే సినిమా షూటింగ్‌ల్లో పూజా బిజీకానుంది. ఎందుకంటే ఆమె చేతినిండా తెలుగు, హిందీ, తమిళ సినిమాలు ఉండటమే కారణం.