2023 చివరికి వచ్చేశాం. దాదాపు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయితే యుద్ధం ముగియలేదు. ఇంకా చెప్పాలంటే అసలైన బాక్సాఫీస్ వార్ ఈ 2 నెలల్లోనే కనిపించబోతోంది. మిగిలిన ఈ 60 రోజుల్లో 4 భారీ సినిమాలొస్తున్నాయి. ప్రతి సినిమాకూ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించే సత్తా ఉంది.. ఇంతకీ ఏంటా 4 సినిమాలు.. వాటికి నిజంగా అంత సత్తా ఉందా?
రానున్న 2 నెలల్లో టైగర్ 3, సలార్, యానిమల్, డుంకీ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ పైకి రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఉదాహరణకు టైగర్ 3నే తీసుకుంటే.. బాక్సాఫీస్ మనీ మెషీన్ సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ఇది. పైగా హిట్ ఫ్రాంచైజీ. మరీ ముఖ్యంగా సెంటిమెంట్ హీరోయిన్ కత్రినా కైఫ్, షారూక్ గెస్ట్ రోల్స్ ఉండనే ఉన్నాయి.
టైగర్ 3 ట్రయిలర్ ఇప్పటికే పెద్ద హిట్. సల్మాన్ సినిమా క్లిక్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. 2 రోజులకే వంద కోట్ల వసూళ్లు వస్తాయి. పైగా బాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇప్పుడు యాక్షన్, మాస్-మసాలా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సో.. టైగర్-3కి ఎటుచూసినా అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఎటొచ్చి సినిమా కంటెంట్ క్లిక్ అవ్వాలి. దర్శకుడు మనీష్ శర్మ ఈ జానర్ సినిమాను ఎలా తీస్తాడనే అనుమానాలున్నాయి. దీనికితోడు కండల వీరుడి ట్రాక్ రికార్డ్ కూడా సరిగ్గా లేదు. ఈ డౌట్స్ క్లియర్ అయితే టైగర్-3కి వెయ్యి కోట్లు పెద్ద లెక్క కాదు.
బాక్సాఫీస్ డైనోసార్ సలార్ కూడా రేసులో ఉంది. ప్రభాస్ మూవీ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. ప్రభాస్ కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీగా సలార్ ను చూస్తోంది దేశం. ఏమాత్రం బాగున్నా చాలు, ప్రభాస్ సినిమాను ఆపడం ఎవ్వరితరం కాదు.
అయితే ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో, ప్రతికూలతలు కూడా అన్నే ఉన్నాయి. ప్రభాస్ వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నాడు. అతడు చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవీ ఆకట్టుకోలేదు. దీనికితోడు జవాన్, టైగర్-3 సినిమాల తర్వాత వస్తున్న మరో మాస్ మూవీని పాన్ ఇండియా ఆడియన్స్ భరించగలరా అనేది కూడా చూడాలి. అయితే ఈ లెక్కలన్నీ కంటెంట్ క్లిక్ అయ్యేంతవరకే. ప్రశాంత్ నీల్ మరోసారి ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టగలిగితే, సలార్ సునామీ సృష్టిస్తుంది.
ఇక లిస్ట్ లో ఉన్న మరో క్రేజీ మూవీ యానిమల్. హీరో రణబీర్ కపూర్, డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇద్దరూ అండర్ డాగ్సే. సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్న వాళ్లే. ఇలాంటి ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా యానిమల్. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టున్నాయి. సో.. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమా యానిమల్.
ఇక లిస్ట్ లో చివరి సినిమా డుంకీ. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తున్న షారూక్ నుంచి వస్తున్న మూవీ ఇది. పైగా రాజ్ కుమార్ హిరాణీ లాంటి దర్శకుడి సృష్టి. కాబట్టి ఈ సినిమా థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఈ ఏడాదికి సిసలైన ఫినిషింగ్ టచ్ ఇదే ఇస్తుందనే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే దీనికి ఉండాల్సిన ప్రతికూలతలు దీనికున్నాయి.
పఠాన్, జవాన్ లాంటి యాక్షన్, మాస్ సినిమాల్లో షారూక్ ను చూసిన జనం, డుంకీలో అతడ్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది ప్రధాన సందేహం. ఇక మరో ప్రతికూల అంశం, సలార్ కు పోటీగా రావడం. మాస్ మసాలా ఫార్ములా క్లిక్ అయి, సలార్ కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే, షారూక్ సినిమా కష్టాల్లో పడినట్టే.
ఇలా రాబోయే 2 నెలల కాలంలో 4 భారీ బడ్జెట్ సినిమాలు, భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది, 2023 బాక్సాఫీస్ కు మంచి ముగింపు ఇస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది.