టాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ ఎక్స్పెక్టేషన్ల మధ్యన దేశ వ్యాప్తంగా విడుదల అయిన అతి భారీ సినిమా.. రిలీజ్ అయ్యి నేటితో సరిగ్గా రెండేళ్లు గడిచాయి. 2019 ఆగస్టు 30వ తేదీన విడుదలైన సాహో దాని మేకర్స్ కు మిశ్రమ అనుభూతులనే ఇచ్చినట్టుగా చెప్పుకోవాలేమో!
అంచనా వేసినంత స్థాయి విజయం సాధించలేకపోవడం ఈ సినిమా ప్రధానమైన ఫెయిల్యూర్. అయితే ఇదేమీ డిజాస్టర్ కాదని గణాంకాలు చెబుతున్నాయి.
కొన్ని లెక్కలేమో ఈ సినిమా గ్రాస్ వసూళ్లు 433 కోట్ల రూపాయలని అంటున్నాయి! మరి కొన్ని గణాంకాలేమో సాహో ఎర్నింగ్స్ దాదాపు 370 కోట్ల రూపాయలని చెబుతున్నాయి. మొత్తం బడ్జెట్ 350 కోట్ల రూపాయలని అంచనా. ఈ నంబర్ల ప్రకారం సాహో బ్రేక్ ఈవెన్ గా నిలుస్తుంది. అయితే.. అమ్మిన ప్రాంతాలు, వసూళ్లు వచ్చిన ప్రాంతాలేవీ..ఈ లోతుల్లోకి వెళ్లడం, అన్ని లెక్కలనూ గట్టడం అంత తేలికేమీ కాకపోవచ్చు.
అయితే 350 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి ఉంటే.. అది గొప్ప విజయం అయ్యేది. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. ఈ మిస్సైల్ ఎక్కుపెట్టిన లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్టే.
ఈ సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగిందని ఆ తర్వాత ఇతడికి అక్కడ వస్తున్న అవకాశాలే చెబుతున్నాయి! బహుబలితో ప్రభాస్ బాలీవుడ్ క్రేజ్ వన్ ఫిల్మ్ వండర్ గా మిగిలిపోలేదు. దాన్ని సాహో కంటిన్యూ చేసింది. విఫలమో సఫలమో కానీ.. ఏతావాతా తెలుగు వాళ్లు చేసిన ఒక భారీ సినీఫైనాన్షియల్ ఎక్స్పరిమెంట్ సాహో!