హాయిగా చిన్న కామెడీ సినిమాలు తీసుకునే దర్శకుడు శ్రీనివాసరెడ్డి, ఢమరుకం అనే పేద్ద ఫాంటసీ సినిమాను తలకెత్తుకున్నారు. అది కూడా పెద్ద హీరోతో. దాంతో అవ్వాల్సింది అయిపోయింది. ఆ గ్రహణం వీడి మళ్లీ ఇన్నాళ్లకు ఓ సినిమా తయారుచేసి, విడుదలకు రెడీ చేస్తున్నారు. రాగల 24 గంటల్లో అన్నది టైటిల్.
థ్రిల్లర్ జోనర్ కు సంబంధించిన ఈ సినిమా ట్రయిలర్ ను బయటకు వదిలారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట..ఆపై అన్యోన్య దాంపత్యం..తరువాత ఆ మగడి హత్య..పోలీసులు..బ్లాక్ మెయిల్..ఇలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ను చూపిస్తూ ట్రయిలర్ కట్ చేసారు.
ట్రయిలర్ ఆసక్తి రేకెత్తించేలాగే వుంది. ఈషారెబ్బా, సత్య కీలకపాత్ర ధారులుగా కనిపిస్తున్నారు. ట్రయిలర్ లో బోలెడు మంది అనుమానితులను చూపించి, ముగింపులో 'నా భర్తను నేనే చంపాను' అని చెప్పించడం ద్వారా సినిమాలో ఏదో వుంది విషయం అనిపించే జాగ్రత్త తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రఘు కుంచె నేపథ్య సంగీతం అందించిన ఈ సినిమా తో శ్రీనివాసరెడ్డి కొత్త జోనర్ లో అడుగు పెడుతున్నారు. కామెడీ నుంచి ఫాంటసీకి వెళ్లి, ఇప్పుడు థ్రిల్లర్ కు వచ్చారు. ఈ సినిమా ఈ నెలలోనే విడుదలవుతుంది.