ఇసుక సమస్యను పరిష్కరించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సవాల్ చేయడాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేసారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రోడ్లే వేయలేదు, ఇక పవన్ నడిచేది ఎక్కడ అని ఆయన ఎద్దేవా చేసారు. అమరావతి అంతా గ్రాఫిక్స్ తప్ప, చంద్రబాబు ఓ బాత్ రూమ్ కూడా కట్టింది లేదని కన్నబాబు అన్నారు.
చంద్రబాబుతో ఫెవికాల్ బంధం పెనవేసుకున్న పవన్, తనను తరచు విమర్శించడానికి కారణం అక్కరలేదని, ఆయన విమర్శలను పట్టించుకోవాల్సిన పనీ లేదని కన్నబాబు అన్నారు. సినిమా డైలాగులతో ఓట్లు రాబట్టలేమని ఇప్పటికే పవన్ కు తెలిసి వచ్చి వుండాలని ఆయన అన్నారు.
వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడితే, పవన్ తెలిసీ తెలియని జ్ఞానంతో ఏదోదో మాట్లాడుతున్నారని కన్నబాబు వివరించారు.
ఆయన ప్రసంగాలు, వ్యవహారాలు చూస్తుంటే సినిమాలు వదిలేసినా, యాక్టింగ్ మానలేదని అనిపిస్తోందని చమత్కరించారు.
చంద్రబాబు తనను జనం నమ్మడం మానేసారని, పవన్ భుజంపై తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నారని, ఇది తెలియక, తననే హీరో చేస్తున్నారనుకుని పవన్ తెగ గెంతుతున్నారని కన్నాబాబు విమర్శించారు.