తమ పార్టీనేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. అతి త్వరలో అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఎవరికి వారు తోచినట్టుగా స్పందించవద్దని ఆమె ఆదేశించారు. ఇది వరకూ కీలకమైన అంశాల విషయంలో కాంగ్రెస్ నేతలు తలోమాటా మాట్లాడారు. దీంతో ఆ పార్టీ పరువు పోయినట్టు అయ్యింది.
అయితే అయోధ్య విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి రానీవ్వొద్దని ప్రియాంక తన పార్టీ వాళ్లను ఆదేశించారు. అయోధ్య పై సుప్రీం ఇచ్చే తీర్పు వెంటనే ఎవరూ స్పందించవద్దని, తీర్పును పరిశీలించి పార్టీ ఒక అభిప్రాయానికి వస్తుందని.. ఆ అభిప్రాయాన్నే అందరూ వ్యక్తం చేయాలని ప్రియాంక ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
ఇది వరకూ జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెన్టీ విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కొందరు ఆ ఆర్టికల్ రద్దును ఖండించగా, మరికొందరు స్వాగతించారు. కాంగ్రెస్ లోని కీలకమైన నేతల నుంచినే భిన్నాభిప్రాయాలు వినిపించాయి ఆ అంశంలో.
ఈ నేపథ్యంలో అయోధ్య అంశం అంతకన్నా కీలకమైనది. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆ అంశం గురించి సర్వోన్నత న్యాయస్థానం ఏం తేలుస్తుందనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశం. ఇలాంటి నేపథ్యంలో ఆ తీర్పు రాగానే తలో రకంగా స్పందించి, పార్టీ పరువును తీయొద్దని, పార్టీకంటూ ఒక విధానం ప్రకటించే వరకూ వేచి చూడాలని ప్రియాంక ఆదేశించారు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు పార్టీ పరువు పోనీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే ఉన్నారే!