మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. ఫలితాలు వచ్చి ఇప్పటికే పన్నెండు రోజులు గడిచిపోయాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు.
కలిసి పోటీ చేసినప్పటికీ, కనీస మెజారిటీని సాధించినప్పటికీ బీజేపీ-శివసేనలు సీఎం పీఠం విషయంలో ప్రతిష్టకు వెళ్లాయి. సీఎం పదవి దక్కించుకోవడానికి ఇరు పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఒకరికి ఛాన్స్ ఇవ్వడానికి మరొకరు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది.
ముఖ్యమంత్రి పీఠం తమకేనని, సేనకు అవకాశం ఇచ్చేదే లేదని బీజేపీ తరఫున సీఎం ఫడ్నవీస్ ప్రకటించేశారు. ఎన్నికల ముందే పదవీ కాలాన్ని పంచుకోవడానికి తమతో బీజేపీ ఒప్పందం చేసుకుందని శివసేన అంటోంది. ఆ ఒప్పందానికి విలువను ఇవ్వాల్సిందే అని సేన వాదిస్తూ ఉంది.
రోజులు గడుస్తున్నాయి కానీ.. ఇరు వైపుల నుంచి ఎవ్వరూ బెట్టు వీడటం లేదు. ఇక వాళ్లిద్దరూ గొడవ పడుతుంటే.. కాంగ్రెస్-ఎన్సీపీలు తాపీగా చూస్తూ ఉన్నాయి. తాము ప్రతిపక్షమే అని ఎన్సీపీ అంటోంది. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారట ఎన్సీపీ వాళ్లు!
ఏదేమైనా శివసైనికుడే మహారాష్ట్రకు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని శివసేన నేత సంజయ్ రౌత్ గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు. అది బీజేపీ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు అయినా, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయినా.. సీఎం మాత్రం శివసైనికుడే అని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. ఈ ప్రకటనలపై కమలం పార్టీ కిమ్మనడం లేదు!