కేవలం 25 ఎపిసోడ్స్ అని మాత్రమే తనకు చెప్పారని, అందుకే జబర్దస్త్ చేయడానికి ఒప్పుకున్నానని అంటున్నారు నాగబాబు. నిజంగా ఇన్నేళ్లు సాగదీస్తారని తెలిస్తే అప్పుడే ఆలోచించే వాడిననే అర్థం వచ్చేలా మాట్లాడారు. నిజానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలవడం వల్ల తను వెల్లలేదని, ఓ మేనేజర్ కోరితే వెళ్లానని చెప్పుకొచ్చారు.
“మల్లెమాలలో అప్పుడు నేను అదుర్స్ అనే కార్యక్రమం చేస్తున్నాను. ఆ టైమ్ లో ఏడుకొండలు అనే మేనేజర్ ఉండేవాడు. జబర్దస్త్ అనే కార్యక్రమం వస్తోందని, కేవలం 25 ఎపిసోడ్లు ప్లాన్ చేశారని ఆయన నాకు చెప్పాడు. అందుకే ఒప్పుకున్నాను. కట్ చేస్తే, జబర్దస్త్ షో పెద్ద హిట్ అయింది. తొలి 2 ఎపిసోడ్స్ కే అది సూపర్ హిట్ అయింది.”
మొదటి ఎపిసోడ్ పూర్తయిన వెంటనే షో పెద్ద హిట్ అవుతుందని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుమార్తెకు తను చెప్పానని అన్నారు నాగబాబు. కామెడీపై తనకు అంత పట్టుందని, ఆ నమ్మకంతోనే చెప్పగా, అది నిజమైందన్నారు నాగబాబు. వ్యక్తిగతంగా తనకు కామెడీ అంటే ఇష్టమని, అందుకే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరిన వెంటనే జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగేందుకు ఒప్పుకున్నానని అన్నారు.
వేరే పార్టీకి చెందిన రోజాతో కార్యక్రమం నిర్వహించడంపై కూడా స్పందించారు నాగబాబు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండడం ఎంత సహజమో.. క్రియేటివ్ సైడ్ వచ్చేసరికి కలిసి పనిచేయడం కూడా అంతే సహజం అన్నారు నాగబాబు.