జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. రానురాను పవన్, చంద్రబాబుకు కోరస్ గా మారారని విమర్శించారు. బాబు పాటకు వంతపాడడం తప్ప పవన్ చేస్తున్నది ఏం లేదని ఎద్దేవా చేశారు.
“అవినీతిపై ఫిర్యాదుల కోసం తొలిసాలిగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేశాం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికైనా ఈ ఆలోచన వచ్చింది. మాకొచ్చింది. మేం పెట్టాం. మరి ఈ విషయం పవన్ కు కనిపిస్తుందో లేదో? ఆయనకు ఇలాంటివి కనిపించవు. పవన్ కు ఎంతసేపు చంద్రబాబే కనిపిస్తారు. బాబు ఏం చెబితే పవన్ దానికి కోరస్. ఆఖరికి పవన్ పరిస్థితి కోరస్ కింద అయిపోయింది. మెయిన్ పోయి కోరస్ కి వచ్చింది.”
నవరత్నాలు, ఇసుక పాలసీ, ఇంగ్లిష్ మీడియం లాంటి కొత్త విధానాల్ని అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఒప్పుకున్నారు బొత్స. ఓ మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, అలా అని వెనకడుగు వేయకూడదన్నారు.
“సంస్కరణలు చేపడుతున్నప్పుడు, మంచి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు ఓ 10 రోజులు ఇబ్బందులుంటాయి. ఈమాత్రం దానికే ప్రజల్ని బెదరగొడుతున్నారు బాబు. ఆయనెప్పుడూ గోతికాడ నక్కలాగ రెడీగా ఉంటారు. పొరపాటున మేం వెనక్కి తగ్గితే, ఆయనే మేలు చేసినట్టు వక్రీకరించుకుంటాడు. ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో తెలీదు, ఎవర్ని తిడతారో తెలీదు, ఎప్పుడు ఎవర్ని వదిలేస్తారో, ఎప్పుడు ఎవరితో కలుస్తారో కూడా తెలీదు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడ్డం వేస్ట్.”
త్వరలోనే అసెంబ్లీ సమావేశాలున్నాయని, అసెంబ్లీలో మాట్లాడ్డానికి అంశాలు లేక.. చంద్రబాబు ఇలా కొన్ని డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని, వాటికి పవన్ వంతపాడుతున్నారని బొత్స అన్నారు. రాజధాని ప్రాంతంలో తిరుగుతానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏ మొహం పెట్టుకొని రైతుల ముందుకు వెళ్తారని ప్రశ్నించారు బొత్స.