ప్రస్తుతం పత్రికా రంగం పరిస్థితి బాగాలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న న్యూస్‌ప్రింట్ మీద కేంద్ర ప్రభుత్వం పది శాతం సుంకం వేయడంతో దేశవ్యాప్తంగా వార్తా పత్రికలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఈ గడ్డు, క్లిష్ట పరిస్థితి తెలుగు పత్రికలకూ తప్పలేదు. దీంతో దాదాపు అన్ని తెలుగు పత్రికలు పొదుపు చర్యలు తీసుకున్నాయి. పేజీలు తగ్గించాయి. సిబ్బందిని తగ్గించుకున్నాయి. అదనపు సిబ్బంది పేరిట కొందరిని నిర్దాక్షణ్యంగా ఇంటికి పంపేశాయి. తెలుగు దినపత్రికలు ఏనాడో రేట్లు పెంచేశాయనుకోండి. ప్రస్తుతం పత్రికలు బతుకుబండి లాగడం చాలా కష్టంగా ఉంది. బడా మీడియా సంస్థలు ఏదోవిధంగా మనుగడ సాగిస్తున్నాయి. కాని చిన్న, మధ్య తరగతి పత్రికలు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. వాటికి సర్క్యులేషన్ లేదు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ప్రకటనలూ లేవు. వాటిల్లో రంగుల పేజీలూ ఎక్కువ ఉండవు.
సరే…ఇతర పత్రికల సంగతి అలా పక్కన పెడదాం. తెలుగులో 'ప్రజాపక్షం' అనే దిన పత్రిక ఉంది. ఇది ఏ కార్పొరేట్ సంస్థో, ప్రయివేటు సంస్థో నడుపుతున్న పత్రిక కాదు. ఇది కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పత్రిక. ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐకి 'విశాలాంధ్ర' దినపత్రిక ఉండేది. సీపీఎంకు 'ప్రజాశక్తి' ఉండేది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీపీఐ రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వగా, సీపీఎం విభజనను వ్యతిరేకించి సమైక్య రాష్ట్రానికి మద్దతు పలికింది. రాష్ట్ర విభజన తరువాత కూడా ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు విపరీతంగా ఉండటంతో తమ పత్రికల పేర్లలో 'తెలంగాణ' పదం లేకపోతే ప్రజలు ఆదరించరనే నిర్ణయానికి వచ్చాయి. అప్పటికే 'నమస్తే తెలంగాణ' పత్రిక ప్రజాదరణను పొందుతోంది.
దీంతో సీపీఎం 'ప్రజాశక్తి'ని ఏపీకి పరిమితం చేసి తెలంగాణలో పత్రికకు 'నవతెలంగాణ' అని పేరు పెట్టింది. సీపీఐ 'విశాలాంధ్ర'ను ఏపీకి పరిమితం చేసి తెలంగాణలో పత్రికకు 'మన తెలంగాణ' అని పేరు పెట్టింది. ఈ రెండు పత్రికలు ఇలా పేర్లు మార్చాయి తప్ప నడుస్తున్న పత్రికల్లో ఏవీ పేర్లు మార్చులేదు. 'ఈనాడు' పేరులో ప్రాంతం పేరు లేదు. కాబట్టి వారు భయపడలేదు. అలాగే ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పేర్లలో 'ఆంధ్ర' పదమున్నా ఆ పత్రికల యాజమాన్యాలు తెలంగాణ ఎడిషన్ పేరు మార్చలేదు. అంతమాత్రాన వాటిని ప్రజలు తిరస్కరించలేదు. కాని భయపడిపోయి పేర్లు మార్చుకున్న కమ్యూనిస్టు పార్టీల పత్రికలు క్రమంగా ఆదరణ కోల్పోతూ వచ్చాయి. రాజకీయంగా సీపీఐ, సీపీఎం ఎలా ఆదరణ కోల్పోతూ వచ్చాయో అదే పరిస్థితి పత్రికలకూ ఎదురైంది.
పత్రికలే కాదు, ఈ రెండు పార్టీలు పెట్టిన టీవీ ఛానెళ్లకూ (10 టీవీ-సీపీఎం, 99 టీవీ-సీపీఐ) ప్రజాదరణ లేకపోవడం, నష్టాలు రావడంతో అమ్మేసుకున్నాయి. ఈ క్రమంలో 'మన తెలంగాణ' చేతులు మారింది. ఈ తరువాత సీపీఐ 'ప్రజాపక్షం' పేరుతో పత్రిక తెచ్చింది. ప్రస్తుతం ఇది గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కమ్యూనిస్టు పత్రికలు పార్టీ పత్రికలు కాబట్టి వాటిల్లో సిబ్బందికి జీతాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. జీతాలు, యాడ్స్, సర్క్యులేషన్…ఇలా ఏ విషయంలోనూ మిగతా పత్రికలతో పోటీ పడలేవు. ఈమధ్య 'ప్రజాపక్షం' పత్రిక తన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ పత్రికలోనే ఎడిటోరియల్ వంటిది రాసింది. పత్రికా రంగం కార్పొరేట్‌మయమైపోయిందని, స్వార్థపరశక్తుల చేతుల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పత్రికను నడుపుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని తెలిపింది.
'ప్రజాపక్షం విపరీతమైన నిధుల ఎదుర్కొంటున్నది. ఈ స్థితిలో ప్రజానుకూల, స్వతంత్ర పత్రికా రచన కొనసాగించడం దురదృష్టవశాత్తు దుస్సాహసంగా పరిణమిస్తోంది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ ఆధీన సంస్థలతోపాటు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యాపార ప్రకటనలు అందకుండా చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఇనుమడిస్తున్నాయి. ప్రజల అండదండలే ఈ పత్రిక మునుముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ మీడియాను పరిరక్షించడానికి మీ శక్తి కొద్దీ పెద్ద మనసుతో ఉదారంగా విరాళాలందించి, చందాదారులుగా చేరి చేయూత ఇవ్వాలని కోరుతున్నాం. ఈ తరహా విరాళాలతో పత్రిక నడపడం ఈ రాష్ట్రంలో కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం సఫలం కావడం ప్రజల చేతుల్లోనే ఉంటుంది.'…అని 'ప్రజాపక్షం' తన ఆవేదనను ప్రజల ముందు ఉంచింది. ఆవేదనాపూరితమైన ఈ విజ్ఞప్తి ప్రజలను కదిలిస్తుందా?