మానవుడి మేధకు అందని గొప్ప విషయం ఏదైనా ఉందంటే అది అతడి మెదడే! ఏ అంతరిక్షం గురించినో మనిషి తేల్చలేని అంశాలెన్నో ఉండొచ్చు, విశ్వంలో ఏముందనే అంశం గురించి మనిషి ఆలోచనలు శతాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటి గురించి ఆలోచించే శక్తి మనిషికి ఎలా వచ్చిందనేదే పెద్ద మిస్టరీ! తరచి చూస్తే.. మనిషి మేధే అతడు చెబుతున్న మిథ్యలో భాగమని కొందరు మేధావులు అభిప్రాయపడ్డారు. తన ఆలోచనకు అందని వాటిని మిథ్యలో భాగమని మనిషి అంటాడు. అలాంటి మిథ్యలో మనిషి మెదడు కూడా భాగం కాదా?
మనిషి మెదడు అంతుబట్టనిది అనే చెప్పే సినిమా 'ఏ బ్యూటిఫుల్ మైండ్'! దాదాపు 19 సంవత్సరాల కిందట వచ్చిన ఒక అద్భుతమైన హాలీవుడ్ సినిమా ఇది. ఇదొక వ్యక్తి నిజ జీవిత కథ అంటే అంతుబట్టని ఆశ్చర్యం కలుగుతుంది. అది కూడా నోబెల్ పురస్కారాన్ని పొందిన మేధావి కథ! అర్థ శాస్త్రంలో తను ప్రతిపాదించిన సిద్ధాంతాలతో నోబెల్ పురస్కారాన్ని పొందిన ఆ మేధావి పడిన మానసిక సంఘర్షణే ఈ సినిమా కథ. ఒక వ్యక్తి మానసిక సమస్య గురించి ఇంత అద్భుతమైన థ్రిల్లర్ సినిమా తీయొచ్చని నిరూపించిన ఈ సినిమా మేకర్లను ఎంత పొగిడినా తక్కువే!
జాన్ నాష్.. అర్థశాస్త్రంలో ఏ డిగ్రీనో చేసిన వారికి ఈ పేరు తెలిసి ఉండొచ్చు. ఆయన ఆర్థిక శాస్త్రం గురించి చేసిన పరిశోధనలకు పురస్కారాలను పొందాడని, ఆయన ప్రతిపాదించిన సూత్రాలను అర్థశాస్త్రంలో నిత్యం మనం వాడుతూ ఉంటామని వారికి తెలియవచ్చు. అయితే.. జాన్ నాష్ చాలా కాలం పాటు ఒక మానసిక రోగిగా బాధపడ్డారనే విషయాన్ని, ఆయనను ప్రపంచం ఒక పిచ్చివాడిగా చూసిందనే విషయాన్ని చెబుతూ.. ఆయన తన జీవిత కాలం అలా పిచ్చివ్యక్తిగానే బతికారనే ఆశ్చర్యమైన విషయాన్ని వివరిస్తూ ముగుస్తుంది ఈ సినిమా!
1947లో ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ గా జాన్ నాష్ ఎంటర్ కావడంతో సినిమా ప్రారంభం అవుతుంది. సిగ్గరి, మొహమాటస్తుడు నాష్. అలాగే అర్థశాస్త్ర పితామహుడిగా పేరు పొందిన అడమ్ స్మిత్ ప్రతిపాదనలను కూడా తోసిపుచ్చుతుంటాడు ఈ మేధావి. ఈ విషయంలో సాటి గ్రాడ్యుయేట్లు అభ్యంతరం చెబుతూ ఉంటారు. కానీ వారితో ఏకీభవించక నాష్ తన థియరీని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో అదే వర్సిటీలో మరో పరిశోధకుడు అయిన లిటరేచర్ స్టూడెంట్ ఛార్లెస్ హెర్మన్ పరిచయం అవుతాడు. నాష్ ను గట్టిగా సమర్థిస్తూ ఉంటాడు హెర్మన్.
పరిశోధన పూర్తయ్యాకా నాష్ కు పెంటగాన్ నుంచి పిలుపు అందుతుంది. నాష్ కు ఉన్న అపారమైన తెలివితేటలను గ్రహించి అమెరికన్ రక్షణ రంగ సంస్థ అయిన పెంటగాన్ ఆయనను పిలిపించుకుంటుంది. నాష్ కు పెంటగాన్ సూపర్ వైజర్ విలియమ్ పార్చర్ జాబ్ ఆపర్ చేస్తాడు. అమెరికాకు వ్యతిరేకంగా సోవియట్ చేస్తున్న కుట్రలకు సంబంధించి కోడ్ ను డిస్క్రిప్ట్ చేయడం బాధ్యతగా ఇస్తాడాయన. తనకు అప్పగించిన బాధ్యతలోని గొప్పదనాన్ని చూసి నాష్ పొంగిపోతాడు. సోవియట్ ఎనిగ్మాను డీకోడ్ చేస్తూ.. అమెరికాను దెబ్బతీయడానికి ఆ దేశం తయారు చేస్తున్న బాంబ్ రహస్యాలను నాష్ కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకు సంబంధించి డీకోడ్ చేయడానికి వార్తా పత్రికలను, మ్యాగజైన్లను ఉపయోగిస్తూ.. తన బుర్రకు పదును పెడుతూ నాష్ పని చేస్తూ ఉంటాడు, తను కనుగొన్న విషయాలను పత్రాల్లో రాసి రహస్యంగా-పెంటగాన్ కు చేరేలా ఏర్పాటు చేసిన పోస్టుబాక్సులో వేసి వస్తుంటాడు నాష్.
ఈ క్రమంలో ఒక రోజు అదే పని చేసి తిరిగి వస్తుండగా.. కొందరు గూఢచారులు నాష్ ను వెంబడిస్తారు. సోవియట్ ఏజెంట్లు అయిన వాళ్లు నాష్ పై కాల్పులు జరుపుతారు. ఈ క్రమంలో విలియమ్ పార్చర్ వచ్చి నాష్ ను రక్షించి ఇంటి దగ్గర వదుల్తాడు. తన భార్యకు జరిగిన విషయాన్ని అంతా చెబుతాడు నాష్. అలాంటి ప్రమాదకరమైన బాధ్యతల నుంచి తప్పుకోమని అమె అతడికి సూచిస్తుంది. నాష్ కూడా ఏకీభవిస్తాడు. ఇదే విషయాన్ని పార్చర్ కు చెబుతాడు. కానీ దానికి అతడు ఒప్పుకోడు. తను చెప్పిన పని చేయాల్సిందే అని, సోవియట్ కోడ్ లను డీకోడ్ చేయాల్సిందే అని, లేకపోతే తను ఎలాంటి రక్షణా ఇవ్వనంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్తాడు నాష్. అక్కడ అతడిని కొంతమంది వెంటాడతారు. వారు సోవియట్ ఏజెంట్లని, తనను చంపాలని చూస్తున్నారని అరుస్తూ క్లాస్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుతాడు నాష్. ఆ మేధావి విపరీత ప్రవర్తన, అరుపులు చూసి అంతా ఆశ్చర్యపోతారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది!
నాష్ పారనాయిడ్ స్క్రిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని వైద్యులు తేలుస్తారు. లేనిది ఊహించుకోవడం ఆ జబ్బు లక్షణం! అతడు తనను సోవియట్ ఏజెంట్లు వెంటాడుతున్నారని ఊహించుకుంటున్నాడని వైద్యులు నాష్ భార్యకు చెబుతారు. అయితే వైద్యులు అబద్ధం చెబుతున్నారని ఆమె వాదిస్తుంది. తన భర్తకు పెంటగాన్ బాధ్యతలు ఇచ్చిందని, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆమె వాపోతుంది. అందుకు ఆధారాలు చూపమని వారు అడుగుతారు. నాష్ చెప్పిన హిడెన్ పోస్ట్ బాక్స్ కు వెళ్లి చూసిన అతడి భార్య షాక్ కు గురవుతుంది. ఆ బాక్స్ లో నాష్ చాన్నాళ్లుగా వేస్తూ వచ్చిన పత్రాలన్నీ అలాగే ఉన్నాయి! అంతే కాదు.. అదంతా ఒక పాడుబడిన బిల్డింగ్, ఆ పోస్టు బాక్సును కూడా ఎవరూ క్లియర్ చేయడం లేదు! నాష్ నిజంగానే స్క్రిజోఫ్రెనియాతో బాధపడుతూ ఉన్నాడు.. అతడు ఊహించుకుంటున్నది కేవలం సోవియట్ ఏజెంట్లు తన వెంట పడుతున్నారనే కాదు, అసలు పెంటగాన్ తనకు ఒక బాధ్యతను ఇవ్వడమే అబద్ధం! సోవియట్ ఏదో బాంబ్ నుతయారు చేస్తోందని, దాని రహస్యాన్ని చేధించే బాధ్యత తనకు ఇచ్చినట్టుగా నాష్ కేవలం ఊహించుకుని ఉంటాడు, పార్చర్ అనే పెంటగాన్ అధికారి కూడా కేవలం నాష్ ఊహే! ఆ ఊహాలు అప్పటికి కావు, చాలా కాలంగా తనకో స్నేహితుడు ఉన్నాడంటూ, ప్రిన్స్ టన్ యూనివర్సిటీ రూమ్ మేట్ హెర్మన్ గురించి కూడా భార్యకు చెబుతూ ఉంటాడు నాష్. అతడు కూడా కేవలం నాష్ ఊహే అని, అలాంటి వ్యక్తి ఎవరూ లేరని ఆమెకు అర్థం అవుతుంది!
పైకి మేధావిగా అర్థశాస్త్ర పరిశోధనలు చేస్తూ, గొప్ప థియరీలు చెబుతున్న నాష్ ఇలా లేనివి ఊహించుకునే పరిస్థితుల్లో ఉన్నాడని వైద్యులు ధ్రువీకరిస్తారు. అతడిని ఆ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు వారు మందులు ఇస్తారు. అయితే నాష్ తన ఊహా ప్రపంచం నుంచి బయటకు రాలేడు. తన చుట్టూ ఉన్న వాళ్లు అబద్ధం చెబుతున్నారని, తామే నిజమని ఊహల్లోని వ్యక్తులు నాష్ ను వెంటాడుతూ ఉంటారు. వాళ్లతో నాష్ సంభాషిస్తూ ఉంటాడు. అతడి ఊహలు అబద్ధమని భార్య అనేక రకాలుగా చెప్పి చూస్తుంది. ఊహల్లోని వ్యక్తుల వయసు పెరగడం లేదు, వాళ్లు ఎప్పుడూ అదే వయసులో ఉన్న విషయాన్ని గ్రహించమని చెబుతుంది. అప్పుడు నాష్ లో మార్పు కనిపిస్తుంది. తన ఊహలను వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అయినా సాధ్యపడదు. ఇంతలోనే మళ్లీ వర్సిటీలో అవకాశం లభిస్తుంది. అక్కడ విద్యార్థులకు డౌట్స్ క్లియర్ చేస్తూ మళ్లీ తన కెరీర్ మొదలుపెడతాడు. 1970 నుంచి అతడికి మళ్లీ టీచింగ్ అవకాశం వస్తుంది. 1994లో నాష్ అర్థశాస్త్రంలో పరిశోధనలకు గానూ నోబెల్ బహుమతి పొందుతాడు. నోబెల్ పురస్కారాన్ని అందుకోవడానికి వెళ్లే నాష్ వెంట అతడి ఊహల్లోని వ్యక్తులంతా కనిపిస్తారు! వాళ్లు నాష్ ఊహలను వదిలిపోలేదు. పురస్కారాన్ని పొందినందుకు అతడిని వారు అభినందించడంతో సినిమా ముగుస్తుంది! తన జీవితాంతం నాష్ ఆ మానసిక జబ్బు నుంచి బయటకు రాలేకపోయాడు. అయినా ప్రపంచానికి ఎంతో పనికొచ్చే అర్థశాస్త్ర సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వాటికి నోబెల్ పురస్కారాన్ని పొందాడు.
ఈ కథ కేవలం ఒక మేధావిని పరిచయం చేయడమే కాదు.. దీన్నొక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచారు. నాష్ పాత్రలో రస్సెల్ క్రో జీవించేశాడు. నాష్ అనే వేరే శాస్త్ర వేత్త అంటే మరెవరో కాదు.. రస్సెల్ క్రోనే అయ్యుండొచ్చు అనే భావన కలిగే స్థాయిలో అతడి నటన ఉంటుంది. నాష్ చుట్టూ ఉన్న వాళ్లంతా కేవలం అతడు ఊహించుకున్న వాళ్లు అని ప్రేక్షకుడికి అర్థమయ్యే సీన్లు మునివేళ్ల మీద నిలబెడతాయి. అంత వరకూ నాష్ చుట్టూ జరిగేదంతా నిజమే అని భావించే ప్రేక్షకుడు, అదంతా కేవలం నాష్ ఊహ అని తెలిసినప్పుడు లోనయ్యే ఆశ్చర్యం, అతడు ఆ ఊహా ప్రపంచం నుంచి బయటపడాలని ప్రయత్నించి విఫలం కావడం..ఇవన్నీ సినిమాను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. పాతికేళ్ల తర్వాత కూడా నాష్ తన ఊహా ప్రపంచం నుంచి బయటకు రాలేదనే క్లైమాక్స్ ట్విస్ట్ తో ఈ సినిమా, నాష్ జీవితం.. వీక్షకుడిని కొన్నాళ్ల పాటు వెంటాడుతుంది! ఎన్నో కొత్త విషయాలను ఆవిష్కరించి, ఎంతో మంది విద్యార్థులకు మేధస్సును ఇచ్చిన నాష్ ఎన్ని మందులు వాడినా, తనను తాను సైకలాజికల్ గా ట్రీట్ చేసుకున్నా.. తన మానసిక సమస్య నుంచి బయటకు రాలేకపోవడం అనే పాయింట్ మనిషి మెదడు మనిషి మేధస్సుకు అందని విషయం అనే విషయాన్ని చెబుతుంది!
-జీవన్ రెడ్డి.బి