సాహ‌సానికి ఊపిరి…ధైర్యానికి ప‌ర్యాయ ప‌దం

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మలో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన వారంతా ఒక్కొక్క‌రుగా దివికేగుతున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌న మ‌ధ్య నుంచి శాశ్వ‌తంగా వీడ్కోలు తీసుకున్నారు. ఇటీవ‌లే రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు మ‌న‌ల్ని వీడి వెళ్లిపోయారు. ఆ బాధ…

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మలో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన వారంతా ఒక్కొక్క‌రుగా దివికేగుతున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌న మ‌ధ్య నుంచి శాశ్వ‌తంగా వీడ్కోలు తీసుకున్నారు. ఇటీవ‌లే రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు మ‌న‌ల్ని వీడి వెళ్లిపోయారు. ఆ బాధ నుంచి టాలీవుడ్ కోలుకోకుండానే మ‌రో స్టార్ త‌న స్నేహితున్ని వెతుక్కుంటూ ఆయ‌న‌ చెంత‌కే వెళ్లిపోయింది.

కృష్ణ మృతితో పౌర స‌మాజం దిగ్భ్రాంతికి గురైంది. ఆదివారం అర్ధ‌రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం తెలిసిందే. త్వ‌ర‌గా కోలుకుని రావాల‌ని అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థ‌న‌లు ఫ‌లించ‌లేదు. కృష్ణ మృతికి ప‌లువురు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని కృష్ణ కుటుంబానికి ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు. కృష్ణ మ‌ర‌ణం న‌మ్మ‌శ‌క్యంగా లేదంటూ చిరు చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.

‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను’ అని కృష్ణ మ‌ర‌ణంపై చిరు త‌న ఆవేద‌న‌ను ఆవిష్క‌రించారు. సాహ‌సానికి ఊపిరిగా కృష్ణ గురించి చెప్ప‌డం విశేషం.