తెలుగు మిడ్ రేంజ్ సినిమా ఇప్పుడు ఒకపక్క బడ్జెట్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరో పక్క మార్కెటింగ్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్, కళ్యాణ్ రామ్, విష్వక్ సేన్, గోపీచంద్,నితిన్, విజయ్ దేవరకొండ నాగ్ చైతన్య, నాని, రవితేజ ఇలా ఎవరితో తీసినా కూడా రెండు సమస్యలు వస్తున్నాయి.
ఒకటి బడ్జెట్. ఎలా లేదన్న మినిమమ్‌లో మినిమమ్ 45 కోట్లు కావాలి. మాగ్జిమమ్ 75 కోట్లు. ఈ మధ్యలో వుంటోంది బడ్జెట్. స్టార్ రెమ్యూనిరేషన్ 10 కోట్లకు కాస్త అటుగా వుంటే బడ్జెట్ 40 నుంచి 45 కోట్లు అవుతోంది. రెమ్యూనిరేషన్ 25 నుంచి 30 కోట్ల మధ్య వుంటే బడ్జెట్ 75 కోట్లకు చేరిపోతుంది.
ఇప్పుడు మార్కెటింగ్ సమస్య ఎదురవుతోంది. ఒక్క నాని, విజయ్ దేవరకొండ ఇంకా మరో ఒక్కరిద్దరు తప్పిస్తే మిగిలిన వారికి నాన్ థియేటర్ మార్కెట్ కావడం చాలా కష్టంగా వుంది. బ్యానర్, జానర్, కాంబినేషన్ సెట్ అయితే చైతన్య లాంటి వాళ్ల వరకు ఒకె అవుతోంది. మిగిలిన వారికి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే వుంది. రవితేజ ఈగిల్ సినిమా నాన్ థియేటర్ అమ్మకాలు కాకుండానే థియేటర్లో విడుదల చేసుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ నాన్ థియేటర్ అమ్మకాలు నిర్మాతకు వున్న సర్కిల్, పేరు వీటి మీద ఆధారపడి జరిగినా, పాతిక కోట్ల నుంచి 60 కోట్ల వరకు వస్తోంది. అక్కడికి ఏ రేంజ్ సినిమా అయినా అది నలభై నుంచి నలభై అయిదు కోట్ల సినిమా అయినా, డెభై కోట్ల సినిమా అయినా, డెభై అయిదు కోట్ల సినిమా అయినా ఒకటే సమస్య ఎదురవుతోంది. థియేటర్ మార్కెట్.
ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి 25 కోట్లు కనీసం తీసుకురావాలి. అది మిడ్ రేంజ్ లో స్టార్టింగ్ హీరో అయినా ఈ పాతిక కోట్లు థియేటర్ మీద నుంచి తేవడం అన్నది తప్పడం లేదు. కానీ అక్కడే రెండు సమస్యలు వస్తున్నాయి.
ఒకటి అందరికీ పాతిక కోట్ల థియేటర్ మార్కెట్ లేదు. మిడ్ రేంజ్ లో పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోల సినిమాలకు పాతిక కోట్ల థియేటర్ మార్కెట్ రావడం లేదు. మహా అయితే పదిహేను కోట్లు వస్తున్నాయి. పాతిక కోట్లు ఆ పైన తీసుకునేవారికి థియేటర్ మార్కెట్ పాతిక కోట్ల వరకు వుంటోంది. అది కూడా ఒక్క నాని వరకే అవుతోంది. మిగిలిన వారికి అదీ లేదు. రవితేజ ఈగిల్ సినిమాను స్వంతంగా అడ్వాన్స్ ల మీద విడుదల చేసుకున్నారు.
ఇక్కడ ముచ్చటగా మూడో సమస్య కూడా వుంది. 15 నుంచి 25 కోట్లు మార్కెట్ చేయడం సంగతి అలా వుంటే థియేటర్ నుంచి అంత వసూలు చేయడం లేదు. బ్లాక్ బస్టర్, హిట్ అనిపించుకుంటే అలా అలా మార్జిన్ కు చేరుతోంది. నాని లేటెస్ట్ సినిమా హాయ్ నాన్న మంచి టాక్ తెచ్చుకున్నా థియేటర్ మీద నుంచి పాతిక కోట్లు వసొలు చేయడం కష్టమైంది. ఇప్పుడు రవితేజ ఈగిల్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహా అయితే 15 కోట్లు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు అందుకే చాలా మందితో కొత్తల ప్లానింగ్ అబేయన్స్ లో వుంది. సాయిధరమ్ తేజ్-సంపత్ నంది సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. వైష్ణవ్ తేజ్ చేతిలో సినిమా లేదు. వరుణ్ తేజ్ చేతిలో ఒక సినిమా, గోపీచంద్, శర్వానంద్ చేతిలో ఒక్కో సినిమా వున్నాయి.
ఈ ఏడాది చివర నాటికి మార్కెట్ మెరుగు పడితే ఓకె. లేదూ అంటే చాలా మంది హీరోలకు కష్టకాలం వస్తుంది. రెమ్యూనిరేషన్లు సగానికి సగం తగ్గించుకోవడం లేదా లాభాలు పంచుకునే పద్దతి అలవాటు చేసుకోవడం చేయకపోతే కెరీర్ సమస్య అవుతుంది.