తీసిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్లు ఇచ్చిన డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్. రభసతో ఎన్టీఆర్, హైపర్ తో రామ్ కు మరిచిపోలేని సినిమాలు అందించాడు. ఇప్పుడు ఆ డైరక్టర్ ఓ అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకురావడంతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ డేట్లు దొరికేసాయి. వాస్తవానికి ఇదే సంతోష్ శ్రీనివాస్ రెండు మూడేళ్లుగా మైత్రీమూవీస్ దగ్గర వుండి, పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం థెరి రీమేక్ స్క్రిప్ట్ ను చెక్కుతూ వచ్చారు. ఆఖరికి ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది.
ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ను రవితేజతో చేయాలని అనుకున్నారు. కానీ అదీ క్యాన్సిల్ అయింది. దాంతో ఇచ్చిన అడ్వాన్స్ కు, అన్నేళ్లపాటు తమతో వున్నదానికి సరిపోయిందని, ఇక వదిలేసారు మైత్రీమూవీస్ జనాలు. మరి అదే స్క్రిప్ట్ నో, మరో స్క్రిప్ట్ నో హీరో బెల్లంకొండకు వినిపించడంతో, ప్రాజెక్టు ఒకె అయింది.
అయితే నిర్మాత ఎవరు? ఎప్పుడు ప్రారంభం వగైరా వ్వవహారాలు అన్నీ ఇంకా పెండింగ్ లో వున్నాయి. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ వుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ ను సంతోష్ శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేసారు. ఆ తరువాత రభస టైమ్ ఇద్దరి మధ్య కాస్త గట్టి గొడవలే జరిగాయి అని వార్తలు వినవచ్చాయి.
ఇన్నాళ్లకు ఇద్దరు మళ్లీ ఒకటయ్యారు. ఈ శ్రీనివాస్ తో ఆ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నారు. ఇదిలావుంటే కొన్నాళ్ల క్రితం నక్కిన త్రినాధరావు, ఇంకా మరికొందరి పేర్లు బెల్లంకొండ శ్రీనివాస్ తో వినిపించాయి కానీ, అవన్నీ వెనక్కు వెళ్లినట్లే అనుకోవాలి.