ఎవరో నలుగురు భారీ రెమ్యూనిరేషన్లు తీసుకుని భారిగా సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ ఇండస్ట్రీలో మిగిలిన వారంతా చిన్న చిన్నగానే సంపాదించుకుంటున్నారని, వారిపై దయచూపించాలనే అర్థం వచ్చేలా మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ ఫంక్షన్ లో.
చిరు, చరణ్, పవన్, బన్నీ ఇలా నలుగురు యాభై కోట్ల హీరోలు మెగా ఫ్యామిలీలోనే వున్నారు. ఇక బయట మిగిలింది మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, మాత్రమే యాభై కోట్లు ఆ పైన రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోలు. అందువల్ల సినిమాలను ఆదుకోవాలి అనే ఉద్దేశం వుంటే ముందు మెగా ఫ్యామిలీ నుంచే ప్రారంభం కావాలి.
కరోనా వల్ల కానీ, టికెట్ రేట్ల వల్ల కానీ నిర్మాతకు ఓ పది కోట్లు నష్టం వాటిల్లుతుంది అనుకున్నపుడు, ఆ మేరకు తమ రెమ్యూనిరేషన్ తగ్గించుకోవచ్చు కదా? కొన్నాళ్ల పాటు తగ్గించుకుని సినిమాలు చేయవచ్చు కదా? అప్పుడు మిగిలిన హీరోలు కూడా దాన్ని ఫాలో అవుతారు.
అలా కాకుండా ఎప్పటికీ జనాలనే దోచేసుకోవాలనే ఆలోచన. టికెట్ రేట్లు పెంచేయాలి. జనం డబ్బులు ఇచ్చేయాలి. తాము యాభై కోట్లకు పైగా రెమ్యూనిరేషన్లు తీసేసుకోవాలి. సామాన్యుడి ఇంటికి కరెంట్ బిల్లు వెసులు బాటు ఇవ్వనపుడు, వ్యాపారం సాగించే థియేటర్ కు ఎందుకు ఇవ్వాలి?
సభా ముఖంగా మెగాస్టార్ డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా, కిందకు దిగి జగన్ ను వేడుకున్నట్లుగా కలరింగ్. ఎలాగూ రేపో, ఎల్లుండో టికెట్ రేట్లు సవరిస్తారు. ఆ క్రెడిట్ అప్పుడు ఈయన ఖాతాలోనే కదా పడుతుంది. ఇలా చేస్తేనే కదా అది జరిగేది. అందుకే కావచ్చు ఇదంతా.