cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవి గారి లాజిక్ లేని ఎమోషనల్ బ్లాక్ మెయిల్

చిరంజీవి గారి లాజిక్ లేని ఎమోషనల్ బ్లాక్ మెయిల్

సినిమాల్లో లాజిక్ కంటే మ్యాజిక్ ముఖ్యం అంటారు. చిరంజీవిగారు స్పీచులో కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. 

ఈ రోజు "లవ్ స్టోరీ" ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆ వేదికను చక్కగా వాడుకుని మీడియా ముఖంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసేసారు. తన మాటల్లో సత్యం ధ్వనిస్తున్న ఎఫెక్ట్ కలగజేసారు. ఎమోషనల్ గా గుండెల్ని టచ్ చేసే ప్రయత్నం చేసారు. విషయం తెలియని వాళ్లకి ఆయన చెప్పింది బాగానే ఉందనిపించొచ్చు. కానీ ఆయన విన్నపం చేసుకున్నది సినిమా వ్యాపార వ్యవహారల మీద ప్పొర్యిగా దృష్టి సారించిన ఆ.ప్ర ముఖ్యమంత్రికి. 

కరోనా మహమ్మారి కారణంగా పెట్టిన లాక్ డౌన్ వల్ల నాలుగు నెలల పాటు వేలల్లో ఉన్న ప్రత్యక్ష సినీ కార్మికులు, లక్షల్లో ఉన్న పరోక్ష కార్మికులు అల్లాడిపోయారని, రెకాడితే గానీ డొక్కాడని వారి పరిస్థితి తెలిసి విరాళాలు సేకరించి వాళ్లకి సరుకులందించామని చెప్పారు చిరంజీవి. అది నిజమే. 

కానీ అదే లాక్డౌన్ టైములో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అమాంతం తన రెమ్యునరేషన్ పెంచేసారు. ఒక్క పవన్ మాత్రమే కాదు..ప్రతి తెలుగు హీరో పాండమిక్ టైములో పెంచిన రెమ్యొనరేషన్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాలి. 

అసలే డబ్బుల్లేక, అప్పులు పుట్టక నిర్మాతలు చేతులు పిసుక్కుంటుంటే ఇలా పెంచేస్తే ఎలా అని అడిగితే దానికి సమాధానం కూడా ఈ పెద్ద హీరోలే చెప్పారు. 

"మేము అడిగేది మాకిచ్చేయండి. ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే మిగిలిన వాళ్ల రెమ్యునరేషన్స్ లో చూసుకోండి. తక్కువ పారితోషకాలకి వచ్చే నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని తీసుకోండి. అక్కడ మా డిమాండ్లు ఆపుకుంటాం కాబట్టి మీకు తక్కువలో పనైపోతుంది", అని చెప్పారని పలువురు నిర్మాతలు బయట పడ్డారు. 

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చిరంజీవి గారు ప్రస్తావించిన వేలాదిమంది కార్మికులకి ఏ సినిమాకి పని చేసినా వచ్చే వేతనం ఒకటే. ఉదాహరణకి కోటి రూపాయల సినిమాలో పని చేసే జూనియర్ ఆర్టిస్టుకి, వందకోట్ల సినిమాలో పని చేసే జూనియర్ ఆర్టిస్టుకి రోజు వేతనంగా వచ్చేది వెయ్యి రూపాయలే. 

హీరోలు, డైరక్టర్లు, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ కార్మికుల బతుకులు ఎప్పటికీ మారవు. కాబట్టి ఖర్చంతా పెద్ద నటీనటుల, టెక్నీషియన్ల మీదే ఉంటుంది తప్ప మిగిలిన ఖర్చులో కాదు. 

"అసలు సినిమా తియ్యలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతోంది పరిశ్రమ" అని కూడా చిరంజీవి అన్నారు. ఇదేదో బ్లాక్ మెయిల్ మాదిరిగా ఉంది. తాము సినిమాలు తీయకపోతే ఇంతమంది కార్మికులు రోడ్డున పడతారన్న చందాన చెప్పారు. 

సినిమా అంటే ఆయన స్థాయి పెద్ద సినిమాయే అనుకుంటే ఎలా? చిన్న సినిమాలు చక్కగా తయారవుతున్నాయి, విడుదలవుతున్నాయి, ఓటీటీలకి ఎక్కుతున్నాయి, డబ్బు చేసుకుంటున్నాయి. ఆ సినిమాల్లో పని చేసే కార్మికులకి అందాల్సిన వేతనాలు అందుతూనే ఉన్నాయి. 

కూరగాయల ఉదాహరణ కూడా తీసుకొచ్చారు చిరంజీవి. 

"వంకాయో, బీరకాయో చూసి బాగుంటేనే కొంటాం. ఒక్క సినిమా టికెట్ మాత్రమే ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే కేవలం నమ్మకం మీద కొంటాం" అని అన్నారు. 

చూసి కొనే కూరగాయల ధరలే జనానికి అందుబాటులో ఉండాలని ప్రభుత్వాలు నియంత్రణ చేసి, దళారీలు లేని రైతు బజార్లు నెలకొల్పుతున్నప్పుడు సరుకు ఎలా ఉంటుందో తెలియకుండా కొనే సినిమా టికెట్ ధరల్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించకూడదు? 

ఈ లాజిక్ చెబితే కూరగాలు నిత్యావసరాలు, సినిమా అనేది వినోదం..దానికి, దీనికి ముడి పెడితే ఎలా అనొచ్చు. 

సామన్యుడికి ఒకానొక సినిమా తొలి ఆట చూడాలన్న వీక్నెస్ ఉండొచ్చు. దానిని క్యాష్ చేసుకోవడానికి టికెట్ ధరని అమాంతం రూ. 500 చేసి అమ్మితే అది అన్యాయమే కదా అనేది ప్రభుత్వం పాయింట్. అంత ఎందుకు పెంచాల్సొస్తోంది అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువయ్యిందని సమాధానం. ఎందుకెక్కువయ్యింది అంటే హీరోగారే రూ. 50 కోట్లు పుచ్చుకున్నారని జవాబు. కనుక ఈ సామాన్యుడి వీక్నెస్ ని దోపిడీ చేయడానికి మూలం హీరోల అధిక రెమ్యునరేషన్ అని అర్థమవుతోంది. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే ఈ దోపిడీకి అంతుండదు. 

రెమ్యూనరేషన్స్ కి అంతు ఎందుకుండాలి? హీరోలు తీసుకున్న రెమ్యునరేషన్ కి ట్యాక్స్ కడుతున్నారు కదా. అది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయమే కదా...! అనుకుంటే పొరపాటే. దేశంలోనే అసలు సిసలు హీరో అని బ్రాండ్ తెచ్చుకున్న సోనూ సూద్ విషయం చూస్తున్నాం. ట్యాక్స్ ఎగవేత కేసులు అతనిని చుట్టుకుంటున్నాయి. అతని పరిస్థితే అలా ఉంటే..కాస్త ఫోకస్ ఇటు పెడితే ఇక్కడా తిమింగలాలు కొన్ని బయట పడతాయి. 

ఎంత హీరో సెంట్రిక్ సినిమా ఇండస్ట్రీ అనుకున్నా ప్రభుత్వాల శక్తిని దాటి వారి హీరోయిజం పని చెయ్యదని తెలుసుకోవాలి. 

టికెట్ ధరల్లో సవరణ జరుగుతుంది... అది కూడా సహేతుకంగా. 

ప్రభుత్వ పర్యవేక్షణలో టికెట్లు అమ్మబడతాయి...ఆన్లైన్ వేదికగా. 

అంత వరకే తప్ప ఇష్టమొచ్చినట్లు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుని మాత్రం పెద్ద హీరోలు మరిచిపోవాలి. 

ఈ లెక్కలో థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఓటీటీల నుంచి రాగల మొత్తాన్ని అంచనా వేసుకుని తగిన బడ్జెట్లో సినిమాలు పూర్తి చేసుకోవాలి. 

ఇకనుంచి జరగబోయేది ఇంతే. 

శ్రీనివాస మూర్తి

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×