కశ్మీరీ ఫైల్స్ అనే సినిమాను ఎవరైనా విమర్శించారో అంతే సంగతులు! విమర్శించడం మాట అటుంచి, అందులో లాజిక్స్ ను ప్రస్తావించడం పక్కన పెట్టి, కశ్మీరీ ఫైల్స్ ను ప్రశంసిస్తున్న బీజేపీ.. ఇంతకీ పండిట్ల కోసం ఇప్పటి వరకూ చేసిందేంటి? ఆ దారుణాలు జరుగుతున్నప్పుడు బీజేపీ సపోర్ట్ తో ఉన్న ప్రభుత్వమే కదా.. దేశాన్ని ఏలుతున్నదీ.. అంటూ దీర్ఘాలు తీశారో అంతే సంగతులు! భక్తులు మీద పడి రక్కేస్తారనమాట.
విమర్శించే సాహసం చేసిన వాళ్ల సంగతలా ఉంటే.. ఆ సినిమాను ఎందుకు ప్రశంసించడం లేదంటూ కూడా ట్వీట్లేసుకుని పడిపోవడం మరో పరాకాష్ట. ఇలానే ఆ సినిమాను ప్రశంసించలేదంటూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై కొందరు విరుచుపడ్డారు. తమకు నచ్చిన సినిమాను ఎందుకు ట్వీట్లతో, మెచ్చుగోళ్లతో ప్రమోట్ చేయడం లేదంటూ భక్తజనం అమితాబ్ పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టి ట్రోల్ చేశారు!
ఇలా మిగతా బాలీవుడ్ హీరోలనూ, బాలీవుడ్ జనాలనూ కూడా టార్గెట్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు భక్తగణానికి. మరి దీనికే భయపడ్డాడో.. లేక మరేమిటో కానీ.. ఎందుకైనా మంచిదన్నట్టుగా ఆమిర్ ఖాన్ ఈ సినిమాను ప్రశంసించేశాడు. ప్రతి భారతీయుడూ ఈ సినిమాను చూడాల్సిందేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.
ఆమిర్ ఖాన్ గతంలో భక్తుల ఆగ్రహావేశాలకు తీవ్రంగా గురయ్యాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అసహనం పెరిగిందన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో ఆమిర్ చేసిన వ్యాఖ్యలు భక్తులకు తీవ్ర అసహనం కలిగించాయి. అలా భక్తులకు ఆమిర్ ఖాన్ అయిష్టుడిగానే ఉన్నాడు.
మరి కశ్మీరీ ఫైల్స్ విషయంలో సానుకూల వ్యాఖ్యలతో భక్తులు ఆమిర్ ను క్షమించకపోయినా, అమితాబ్ ను టార్గెట్ గా చేసుకున్నట్టుగా చేసుకోకపోవచ్చు ప్రస్తుతానికి!