కోవిడ్ నాలుగో వేవ్ గురించిన ఊహాగానాలు ఒక వైపు సాగుతూ ఉండగా, మరోవైపు వివిధ కంపెనీలు తమ ఆఫీసులకు తలుపులు తెరుస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులు కేంద్రంగా నడుస్తున్న అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రారమ్మంటున్నాయి.
వాస్తవానికి రెండో వేవ్ ముగిసినప్పుడే చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచాయి సూఛాయగా. వ్యాక్సినేషన్లు చేయించుకొండని, కంపెనీనే మీకు వ్యాక్సిన్ ఇప్పిస్తుందని కూడా అప్పట్లోనే ఆఫీసులు ఉచిత ఆఫర్ ఇచ్చాయి. ఉద్యోగులను ఆఫీసులకు సంసిద్ధం చేసేందుకే కంపెనీలు వ్యాక్సిన్ ఆఫర్ ఇచ్చాయనే విశ్లేషణ అప్పట్లోనే సాగింది.
అయితే మూడో వేవ్ వెనువెంటనే రావడంతో ప్రముఖ కంపెనీలు కాస్త వెనక్కు తగ్గాయి. అయితే.. మూడో వేవ్ చప్పున ఎగసి, చల్లారిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ కంపెనీలు ఉద్యోగులపై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు వారంలో రెండు మూడు రోజుల పాటు .. అనే ఆఫర్ ను ఇచ్చాయి. వారంలో ఐదు రోజుల వర్కింగ్ డేస్ లో రెండు మూడు రోజులు ఆఫీసులకు రావొచ్చని, రావాలని కూడా కొన్ని కంపెనీలు పని విధానాన్ని అమలు చేస్తున్నాయి.
అయితే పేరున్న కంపెనీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఒత్తిళ్లేమీ తీసుకురాలేదు. ఇక ఈ అంశంపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందిస్తూ.. వర్క్ ఫ్రమ్ ఇండియాకు సెట్ కాదన్నారు. పని చేసుకోవడానికి ప్రత్యేకగది భారతీయుల్లో చాలా మందికి లేకపోవడం, ఇంటర్నెట్ స్పీడ్ ఇలాంటివి ఆటంకాలని ఆయన అన్నారు. మరి ఇవేవీ లేకుండానే రెండేళ్లుగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను బాగానే వాడుకున్నాయి! అలాంటిది ఇప్పుడు నారాయణ మూర్తి ఆ అంశాలను ప్రస్తావించడం కాస్త ఆశ్చర్యమే.
ఆ సంగతలా ఉంటే.. ఉద్యోగులు ఆఫీస్ కల్చర్ కు దూరం కావడం వల్ల వారిలో నేర్చుకునే గుణం క్రమంగా నశిస్తుందని, దీర్ఘకాలంలో ఇది దేశానికే మంచిది కాదని మరో మానసిక విశ్లేషణ ఇప్పుడు హైలెట్ అవుతోంది. పిల్లలు ఇళ్లలో ఉండి ఆన్ లైన్ క్లాసులకు పరిమితం కావడం వల్ల వారి మానసిక స్థితికి ఇబ్బందికరం అయినట్టే.. ఉద్యోగుల్లో కూడా అదే తరహా ఇబ్బంది తలెత్తుతుందని ఈ విశ్లేషణ చెబుతోంది.
ఇక కొంతమంది ఐటీ ఉద్యోగులను అడిగినా ఇదే చెబుతారు. ఇళ్లలో రెండేళ్లుగా ఉండటం వల్ల బోర్ డమ్ తీవ్రతరం అయ్యిందని, భార్యాభర్తలు రోజంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండటం అంత బాగా ఏమీ లేదంటున్నారు. ఆఫీసులు తెరిస్తే చాలు.. తాము రెక్కలు కట్టుకు వెళ్లడానికి సిద్ధమని వారు స్పష్టంగా చెబుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోం పేరిట కంపెనీలు కూడా తమను విచ్ఛలవిడిగా వాడుకుంటున్నాయని కూడా వారు వాపోతున్నారు! ఆఫీసుకు వెళ్లడమే అన్ని రకాలుగానూ ఉత్తమం అనే అభిప్రాయం వివాహితులు అయిన ఐటీ ఉద్యోగులు స్పష్టంగా చెబుతున్నారు!