పేకాట పేకాటే, రాజకీయం రాజకీయమే అని వైసీపీ నేతలు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ నిరూపించారు. కర్నాటక-ఏపీ సరిహద్దుల్లో పేకాట ఆడుతూ ఆ రాష్ట్ర పోలీసులకు వీరంతా పట్టుబడ్డారు. హిందూపురంలో బాలకృష్ణ వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తే పీఏ బాలాజీ వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూ పట్టుబడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ, వైసీపీ హిందూపురం మండల కన్వీనర్ శ్రీరామిరెడ్డి, మరికొందరు నాయకులు పేకాడుతూ పోలీసులకు దొరికిపోయారు. దీంతో రాజకీయంగా చేసుకుంటున్న విమర్శలు, గొడవలన్నీ ఉత్తుత్తిదే అని తేలిపోయిందనే చర్చ జరుగుతోంది.
కర్ణాటకలోని నగరగెర సమీపంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం వెళ్లింది. చిక్‌బళ్లాపూర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలకృష్ణ పీఏ బాలాజీతోపాటు హిందూపురం వైసీపీ మండల కన్వీనర్‌తో పాటు అనంతపురం జిల్లాకు చెందిన పలువురు గ్రామస్థాయి రాజకీయ నాయకులు కూడా పట్టుబడ్డారు.
వైసీపీ నేతలతో కలిసి హీరో బాలయ్య పీఏ అరెస్ట్ పేకాట ఆడుతూ పట్టుబడడంపై టీడీపీ, ఏపీ అధికార పార్టీ నాయకులు ఆశ్చర్య పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు పీఏ బాలాజీపై విమర్శిలు గుప్పిస్తున్నారు. ఎంతో నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగిస్తే, వైసీపీ నేతలతో అంటకాగడం ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివన్నీ సర్వసాధారణమే అని మరికొందరు కొట్టి పారేస్తున్నారు.