చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ఆరోపణ ఏపీలో రాజకీయ వేడి పెంచింది. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. దీనిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కూడా జరిగింది.
రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించే పెగాసస్ వ్యవహారంపై విచారణ జరిపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెగాసస్ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయించారు.
ఏపీ అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని సవాల్ విసిరారు. ఆయన ఏమన్నారంటే…
“పెగాసస్‌పై సభా సంఘం వేస్తారా ….న్యాయ విచారణ జరుపుతారా… సీబీఐకిచ్చి దర్యాప్తు చేయిస్తారా? …దేనికైనా మేము సిద్ధం. ఏ విచారణకైనా, ఎన్ని ఎంక్వైరీలకైనా రెడీగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే దీనితో పాటు బాబాయి హత్య, జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై కూడా సభా సంఘం, న్యాయ విచారణ చేయించడానికి ముందుకు రావాలి” అని లోకేశ్ సవాల్ విసిరారు. ప్రతికూల అంశాన్ని కూడా సానుకూలంగా మలుచుకునే క్రమంలో లోకేశ్ ఘాటుగా స్పందించారని అర్థం చేసుకోవచ్చు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇతరుల వ్యక్తిగత గోప్యతను హరించడమనేది పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతికం. దీన్ని ఏ ప్రభుత్వమూ చట్టపరంగా చేయదని తెలుసు. అలాంటప్పుడు పెగాసస్‌ను ఉపయోగించి నాటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని రుజువు చేయడం కష్టం. ఈ విషయాలన్నీ బాగా తెలియడం వల్లే, ఎటూ తేల్చలేరనే ధైర్యమే సవాల్ చేసేందుకు లోకేశ్‌కు ధైర్యాన్ని ఇచ్చింది. ఇదే అమరావతి రాజధాని విషయంలో సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ విచారణకు టీడీపీ ఎందుకు అడ్డు పడుతున్నదో లోకేశ్ సమాధానం ఇవ్వగలరా?
పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే మాత్రం చెలరేగిపోవడం, లేదంటే సమస్యను పక్కదారి పట్టించడంలో టీడీపీ నేతలు ఆరితేరారనేందుకు పెగాసస్ ఉదంతమే నిదర్శనం. రకరకాల వ్యవస్థల్ని అదుపులో పెట్టుకోవడంతో, ఏం చేసినా పట్టుబడమనే ధైర్యం టీడీపీ గుండెల నిండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.