‘అణు’వంత ఆనందం! ఆకాశమంత దుఃఖం!!

సృష్టే విధ్యంసం. విధ్వంసానికే అతడి సృష్టి. అయినా సృష్టి చేస్తాడు. విధ్వంసమని బుధ్ధికి తెలుస్తునే వుంది. మృత్యువునే తాను శిశువుగా ప్రసవిస్తున్నానని అనిపిస్తూనే వుంది. అయినా చేసేస్తాడు మానవాళినే తుడిచి పెట్టగల అణుబాంబును సృష్టించేస్తాడు.…

సృష్టే విధ్యంసం. విధ్వంసానికే అతడి సృష్టి. అయినా సృష్టి చేస్తాడు. విధ్వంసమని బుధ్ధికి తెలుస్తునే వుంది. మృత్యువునే తాను శిశువుగా ప్రసవిస్తున్నానని అనిపిస్తూనే వుంది. అయినా చేసేస్తాడు మానవాళినే తుడిచి పెట్టగల అణుబాంబును సృష్టించేస్తాడు. సృష్టించిన మరుక్షణం కీర్తి ఆకాశాన్నంటుతుంది. అతడిలోని శాస్త్రజ్ఞుడికి మహదానందంగా వుంటుంది. కానీ అతడిలోని మనిషి కుంచించుకు పోతుంటాడు, కునారిల్లి పోతుంటాడు, తనలో తాను విధ్వంసమవుతూ వుంటాడు. అతడే  జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ అణ్వాస్త్ర పితామహుడు. ఇతడి జీవితాన్ని మాత్రమే కాకుండా, జీవితంలోని సంఘర్షణను కేంద్రంగా చేసుకుని విశ్వవిఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్‌ నోలాన్‌ ‘ఒప్పెన్‌ హైమర్‌’ పేరుతో  తెరకెక్కించారు.

అణుబాంబు ప్రయోగం అనగానే రెండు దేశాలు గుర్తుకొస్తాయి. ఒకటి: ప్రయోగించిన అమెరికా, రెండు: విలవిలలాడిన జపాన్‌. జపాన్‌ అంటే ఆ దేశంలోని హీరోషిమా, నాగసాకి. వేసింది జపాన్‌ మీద అయినా మొత్తం ప్రపంచ ప్రజలు వణకిపోయారు. ఎందుకంటే ఈ బాంబు ప్రయోగం వల్ల రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు అమెరికన్లూ మినహాయింపు కాదు. ఆ ప్రాంతాల్లో బతికి వున్న వారి మీద ప్రభావం ఇంతా అంతా కాదు.  ఇంత వినాశకర ప్రయోగానికి మూలకారకుడి మీద ప్రపంచమే భగభగ లాడుతుంది. ఇది ఎప్పటికీ చల్లారని కోపం. అలాంటి వ్యక్తిని కేంద్రంగా చేసి మాత్రమే కాదు, హీరో గా చూపిస్తూ సినిమా తీయటం, తీసి ప్రపంచ ప్రేక్షకుల మెప్పును పొందటం ఆషామాషీ కాదు. కానీ క్రిస్టఫర్‌ నోలాన్‌ చేశారు. ఆయన మాత్రమే చెయ్యగలరు కూడా. అణ్వాయుధ సృష్టికర్తే, అణ్వాయుధ వ్యతిరేకిగా వుండటం ఈ చిత్రం ప్రత్యేకత.

చిత్రమేమిటంటే, భగవద్గీతలోని శ్లోకాలతో ఈ చిత్రం మొదలయి, ముగుస్తుంది. ‘వెయ్యి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎలా వుంటుందో’ అన్న గీత వాక్యం ‘ఇలా వుంటుంది’ అన్న అణుబాంబు విస్ఫోటనాన్ని చూపిస్తారు. నోలాన్‌ చిత్రీకరణ మనోవేగాన్ని మించి వుంటుంది. ఆయన సినిమాను చూస్తున్నప్పుడు కొంతా, చూసేశాక కొంతా ప్రేక్షకుడి మదిలో ఇంకుతూ వుంటుంది. ఆయన ‘ఇన్సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ చిత్రాలు కూడా అంతే. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ ను అమెరికా తెచ్చి, అభివృధ్ధి చేసిన అధ్యాపకుడిగా, శాస్త్ర వేత్తగా ఆయన ఎదిగిన తీరును ఇతర దర్శకులయితే వేరుగా చూపించేవారేమో. కానీ నోలాన్‌ ప్రేక్షకుణ్ణి అతడి జీవితంలోకి, అతడి బుధ్ధిలోకి కూడా తీసుకుపోతాడు. సైన్సు తెలియని వాడికి కూడా కాంతిని మింగగల గురుత్వాకర్షణ శక్తిని అర్థమయ్యేలా చూస్తాడు. దర్శకుడే ఉపాధ్యాయుడయి పోతాడు. అందుకే ఒక దశలో ప్రేక్షకుడికి ‘తాను క్లాసుకు వచ్చానా? లేక సినిమాకు వచ్చానా?’ అని అనుమానం కూడా రావచ్చు. రావాలి. శాస్త్రజ్ఞుడి మనసులోకి వెళ్ళితేనే కాని అతడి బౌధ్ధిక విజయం అర్థం కాదు.

సైన్సులోని ఆవిష్కరణల చుట్టూ రాజకీయాలు ఎలా పరిభ్రమిస్తాయో, నిస్సంకోచంగా ఈ చిత్రంలో నోలాన్‌ చూపిస్తాడు. అణుప్రయోగం తర్వాత, అమెరికా అధ్యక్షుణ్ణి కలసిన సన్ని వేశం ఇందుకు అద్దం పడుతుంది. ఇందుకు కొంత నేపథ్యం కూడా నడుస్తుంది. అసలు అమెరికా అణుబాంబు అన్వేషణ మీద ఎందుకు సమయాన్నీ, ధనాన్నీ ఖర్చు చేయవలసి వచ్చింది? అమెరికా చెప్పబోయిన కారణం ఒక్కటే. రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో హిట్లర్‌ను భయపెట్టడానికి. ఆ యుధ్ధ భయం తొలగి పోయాక కూడా ఈ బాంబు అవసరం ఎందుకు వచ్చింది? పోటీ కొస్తున్న జపాన్‌ పీచమణచటానికా? లేక ఎక్కడో ఒక చోట చేసిన అణు బాంబును ప్రయోగించాలి కాబట్టి, జపాన్‌ ను ఎంచుకుందా? మొదటిది నిజం. రెండవది నెపం. సరిగా ఈ సందర్భంలోనే కలసిన అమెరికా అధ్యక్షుడితో ఒప్పెన్‌ హైమర్‌ సంభాషణ అప్పటి ఆమెరికా సామ్రాజ్య కాంక్షను బయట పెడుతుంది.

‘నా చేతులకు నెత్తురు అంటింది’ అని హైమర్‌ అంటే అమెరికా అధ్యక్షుడు చిన్నగా నవ్వి, తన కోటు జేబులోంచి కర్చీఫ్‌ తీసి ఇవ్వబోయి రాజకీయం చెబుతాడు: ‘ఈ బాంబు నువ్వు చేసినట్టు మరచిపోతారు. బాంబును నేనే చేశాను. నేనే వేశాను.’  అంటే చేసింది అమెరికా, వేసింది కూడా అమెరికా అని మాత్రమే రావాలి. అంతే కాదు, ఆవెంటనే హైమర్‌ను మరో ఆరా కూడా తీస్తాడు. ‘రష్యా కూడా అణుబాంబు తయారు చేస్తుందా?’ అని అడుగుతాడు. ‘చేసే అవకాశం లేక పోలేదు. రష్యాలో కూడా మంచి ఫిజిసిస్టులున్నారు’ అని అంటాడు.

హైమర్‌ కథను తెరకెక్కించిన తీరును చూస్తే, సినిమా మొత్తం మూడంచెలుగా కనిపిస్తుంది. మొదటిది: జీవితం. మళ్ళీ ఇందులో వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం, శాస్త్రవేత్త జీవితం. ప్రేమ, సహజీవనాల్లో సంఘర్షణ. ప్రొఫెసర్లకు కూడా యూనియన్‌ వుండాలనుకోవటం. సైన్సు ప్రయోగాల్లో ఎవరూ తొక్కని దారులు తొక్కటం. వీటితో ప్రేక్షకుణ్ణి ఒక స్థాయికి తీసుకు వెళ్ళాక, అణుప్రయోగంలోని రెండు పార్శ్వాలనూ ఏకకాలంలో చూపిస్తుంటాడు. అణు బాంబు శాస్త్రపరంగా ఎంత గొప్ప అన్వేషణో చెబుతూ హైమర్‌ది ఎంత అపారమైన ప్రతిభో ఒక పక్కనిరూపిస్తాడు. మరో పక్క ఎంత వినాశనానికి దారితీస్తుందో తెలిసి మరీ శాస్త్రవేత్త చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

తాను చేస్తున్న ఈ పనిని సమర్థించుకోవటానికి, యుధ్ధాన్ని నివారించటానికి పనికొచ్చే అస్త్రంగా పోలుస్తాడు. అమెరికా, రష్యా రెండు దేశాల చేతుల్లో అణుబాంబులండటమే ప్రపంచ యుధ్ధ నివారణకు గొప్ప మార్గమని తనను తాను సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తాడు. ‘ఒక సీసాలో రెండు తేళ్ళు వున్నాయి. ఒక దానిని మరొకటి చంపగలవు. కానీ చంపుకోవు. ఎందుకంటే చంపేది కూడా చస్తుంది.’ అంటే ఇటు అమెరికా, అటు రష్యా ఏది అణుబాంబు ప్రయోగించినా రెండు పోతాయీ అని సూత్రంతో తన నేరభావననుంచి బయిట పడతాడు. ఇది రెండో అంచె.

ఇక మూడో అంచె. అతడి ప్రతిభనూ, అమెరికా పట్లా విధేయతను శంకించటం. ఇలా అతనిని అన్ని స్థానాలనుంచి ఆమెరికా బయిటపడుతుంది. అతడికీ, అతడి భార్యకీ వున్న ‘కమ్యూనిస్టు భావాలు, సంబంధాల’ను బయిట పెట్టాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ నోలాన్‌ చేసిన ప్రయోగం మరెవ్వరూ చెయ్యలేరు. తొలుత అతణ్ని దోషిగా నిలబెట్టిన వాదనలూ,  తర్వాత అతణ్ణి నిర్దోషిగా చూపించే కోర్టు రూమ్‌ విచారణా  సమాంతరంగా చూపిస్తూ, సినిమాను క్లయిమాక్స్‌కు తీసుకువెళ్తాడు. అలా ఒప్పెన్‌ హైమర్‌ను ప్రేక్షకుడి మనసు లో శాశ్వతంగా వుండేలా చూపిస్తాడు.