కేవలం మెగాస్టార్ అంటే వేరు..ఆయనతో రామ్ చరణ్ జతకలిసాడు. పోనీ అక్కడితో ఆగిందా వ్యవహారం అంటే అదీ కాదు. పూజా హెగ్డే హీరోయిన్. వీళ్లందరితో కొరటాల శివ డైరక్షన్. దాంతో ఆచార్య సినిమా మార్కెటింగ్ వ్యవహారం వందల కోట్లు దాటేస్తోంది.
దర్శకుడు కొరటాల శివ కేవలం సినిమా డైరక్షన్ మాత్రమే చూడరు. సినిమా మార్కెటింగ్ కూడా ఆయన చేతుల్లోనే వుంచుకుంటారు. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా అంతే. దీని వల్ల చాలా సౌలభ్యాలు వున్నాయి.
ఆయన స్నేహితులకు అవకాశం వుంటుంది. అలాగే రేటు ఆయన అనుకున్నది రాబడతారు. పైగా అన్నింటికి మించి సినిమా విడుదల తరువాత అసలు లెక్కలు వాళ్లకి తప్ప ఎవ్వరికీ తెలియవు. వారు అనుకున్న ఫిగర్లు మాత్రమే బయటకు వస్తాయి.
లేటెస్ట్ గా ఆచార్య వ్యవహారం కూడా ఇలాగే వుంది. సినిమా మార్కెట్ మొత్తం 200 కోట్లు దాటేస్తున్నట్లు బోగట్టా. వైజాగ్, కృష్ణ, గుంటూరు కొరటాల అత్యంత సన్నిహితుడు సుధాకర్ దగ్గర వుంచారు. ఈస్ట్ ను భరత్ చౌదరికి ఇచ్చారు. కొరటాల సినిమాలు ఈస్ట్ అన్నీ ఈయనే చేస్తూ వస్తున్నారు. వెస్ట్ ఎల్ వి ఆర్. నెల్లూరు ఆదిత్య రెడ్డి (యువి నుంచి వచ్చారు), సీడెడ్ అభిషేక్ రెడ్డికి ఇచ్చారు.
కేవలం ఆంధ్రనే 60 కోట్ల రేషియోలో కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం బేరం ఇంకా తెగలేదు. ఇక్కడ దిల్ రాజుతో చిన్న పంచాయతీ వున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను లెక్కలు ఏవో ఇంకా తేలాల్సి వుందని బోగట్టా. అందుకే మళ్లీ వరంగల్ శ్రీను లైన్ లోకి వచ్చారు. 40 నుంచి 45 కోట్ల మధ్యలో కోట్ చేస్తున్నారు. పంచాయతీ తెగితే దిల్ రాజు లేదంటే వరంగల్ శ్రీనుకు నైజాం హక్కులు దక్కుతాయి.
మొత్తం మీద థియేటర్ హక్కులు 150 కోట్ల వరకు వుంటాయని అంచనా. ఇక నాన్ థియేటర్ హక్కులు వుండనే వున్నాయి. మొత్తం మీద 200 కోట్లు దాటేసేలా వుంది సినిమా మీద ఆదాయం. సినిమా ఖర్చు కూడా తక్కువేమీ వుండదు.
మెగాస్టార్, చరణ్, కొరటాల రెమ్యూనిరేషన్ లు కలిపే వంద కోట్లు దాటేస్తాయి. ఇంత భారీ సినిమాకు నిర్మాత నిరంజన్ రెడ్డి.